గుడితో పాటు గుడిసెల్లోకి వెళ్లిన గవర్నరు

గుడితో పాటు గుడిసెల్లోకి వెళ్లిన గవర్నరు

నిత్యం గుళ్లుగోపురాలు దర్శించుకునే గవర్నరు నరసింహన్‌ ఈసారి కాస్త ట్రెండు మార్చారు. దైవ దర్శనంతో పాటు సామాన్యులు, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాన్నీ దగ్గర నుంచి చూశారు. నిత్యం ఆలయ దర్శనాలకే సమయం కేటాయిస్తారని విమర్శలు ఎదుర్కొనే నరసింహన్‌ ఈసారి అమాయక గిరిజన ప్రజల జీవన స్థితిగతులను దగ్గర నుంచి చూశారు. వారి గుడిసెల్లోకి వెళ్లి వారి దుర్భర జీవనాన్ని చూశారు. సౌకర్యాలకు, ఆర్థిక స్థిరత్వానికి వారు ఎంత దూరంగా ఉన్నారో గుర్తించారు.

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యానారాయణమూర్తి ఆలయంలో రథసప్తమి సందర్భంగా దైవ దర్శనానికి వెళ్లిన గవర్నరు నరసింహన్‌ ఆ తరువాత శ్రీకూర్మంలోని కూర్మనాథ ఆలయాన్నీ దర్శించుకున్నారు. అనంతరం ఆయన శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం సీతం పేట వెళ్లి అక్కడ పీఎంఆర్సీలో ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఫొటో ఎగ్జిబిషన్‌ వంటివన్నీ సందర్శించారు. అనంతరం ఆయన నేరుగా సీతంపేట ప్రాంతంలోని గిరిజనుల ఇళ్లకు వెళ్లారు. అక్కడ వారి గుడిసెల్లోకి వెళ్లి అంతా పరిశీలించారు. వారితో మాట్లాడారు. వారి జీవనస్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వారి వెనుకబాటుతనాన్ని అర్థం చేసుకున్నారు. గిరిజనులు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను పరిశీలించి వారిని మెచ్చుకున్నారు.

ప్రభుత్వపరంగా వారికి అందాల్సిన ప్రతి ప్రయోజనం పక్కదారి పట్టకుండా వారికి దక్కేలా చూడాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించిన గవర్నరు ఒక్కసారిగా తన పట్ల చాలామందికి ఉన్న అభిప్రాయం మారేలా చేయగలిగారు. ఎప్పుడూ గుడులు అంటూ తిరిగే ఆయన గిరిజనుల గుడిసెల్లోకి వెళ్లి వారి జీవితాల గురించి తెలుసుకోవడంతో ఇంతకాలం విమర్శించినవారు కూడా మంచి పనిచేశారంటూ ప్రశంసిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English