ఏబీవీపీ పాకిస్థాన్‌ సపోర్టరా?

ఏబీవీపీ పాకిస్థాన్‌ సపోర్టరా?

ఏబీవీపీ... అఖిల భారత విద్యార్థి పరిషత్‌..  బీజేపీ, ఆరెస్సెస్‌ కు అనుబంధంగా పనిచేసే విద్యార్థి సంఘం. అలాంటి ఏబీవీపీ పాకిస్థాన్‌ కు అనుకూలంగా నినాదాలు చేస్తుందని ఎవరైనా ఊహిస్తారా? కానీ.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా స్ప్రెడ్‌ అవుతున్న వీడియోలో మాత్రం ఏబీవీపీ విద్యార్థి నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం కనిపిస్తోంది. ఇప్పుడా వీడియో నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

పార్లమెంటుపై దాడి చేసిన కేసులో ఉరితీతకు గురైన అఫ్జల్‌ గురు ఉరి తీసిన రోజును పురస్కరించుకుని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యూ)లో జరిగిన కార్యక్రమంలో కొంతమంది పాకిస్తాన్‌కు అనుకూలంగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే.

కాగా ఈ నినాదాలు చేసిన విద్యార్థులు ఆరెస్సెస్‌ అనుబంధ ఏబీవీపీకి చెందిన వారుగా గుర్తించారు. ఒక నిముషం 32 సెకండ్లపాటు సాగిన 'ది కాన్‌స్పిరసీ'  అనే ఈ వీడియో ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఏబీవీపీ సభ్యులే భారత్‌కు వ్యతిరేకంగా, పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేశారని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

సమావేశం ప్రశాంతంగా సాగుతున్న సమయంలో కొందరు నినాదాలు చేశారని, ఎవరు ఏం మాట్లాడారో అర్థం కాకుండా పోయిందని వామపక్షాల మద్దతుతో ఏర్పాటైన అఖిల భారత విద్యార్థి సంఘం (ఎఐఎస్‌ఎ) ఆరోపిస్తోంది. అయితే... ఏబీవీపీ మాత్రం దీన్ని ఖండిస్తోంది. జెఎన్‌యూ విద్యార్థి సంఘం కార్యవర్గంలో ఉన్న ఎబివిపి ఏకైక ప్రతినిధి, జెఎన్‌యూఎస్‌యు సంయుక్త కార్యదర్శి, సౌరభ్‌ కుమార్‌ శర్మ మాట్లాడుతూ తమ ప్రతిష్టను దెబ్బ తీయడానికి కొందరు పన్నిన కుట్ర ఇది అని అంటున్నారు.

 జాతి వ్యతిరేక కార్యకలాపాలను మేం అడ్డుకున్నందుకు మా మీద ఇలా దాడిచేస్తున్నారని చెబుతున్నారు. నెట్‌ లో ఉన్నది మార్ఫింగ్‌ చేసిన వీడియో అని చెబుతున్న ఆయన అందులో ఉన్నది తమ సభ్యులు కారని మాత్రం చెప్పడం లేదు. నిజం బీజేపీకే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు