జగన్‌ కు చెమటలు పట్టిస్తున్న వైజాగ్‌

జగన్‌ కు చెమటలు పట్టిస్తున్న వైజాగ్‌

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఒక మోస్తరుగా సీట్లు గెలుచుకుని ఫరవాలేదనిపించుకున్న టీడీపీ తాజాగా గ్రేటర్‌ ఎన్నికల తరువాత పూర్తిగా దెబ్బతిన్నది. గ్రేటర్‌ లో టీఆరెస్‌ భారీ విజయం సాధించడంతో టీడీపీ నేతలంతా అధికార టీఆరెస్‌ లోకి పరుగులు తీస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మిగలడం కూడా కష్టమన్నట్లుగా ఉంది.

ఇప్పుడు ఏపీలో వైసీపీ కూడా అలాంటి ప్రమాదం ఎదుర్కొనే రోజు సమీపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా దారీతెన్నూ లేకుండా సాగుతోంది. ప్రజల్లోనూ పెద్దగా ఆదరణేమీ పెరగలేదు. ఇలాంటి సమయంలో ఆ పార్టీ నేతల్లో చాలామంది పాలక టీడీపీ వైపు చూస్తున్నాన్నది తెలిసిందే. ఇలాంటి తరుణంలో కొద్ది రోజుల్లో విశాఖ నగరపాలక సంస్థకు ఎన్నికలు రానుండడంతో ఒకవేళ అక్కడ టీడీపీ కనుక భారీ ఆధిక్యం సాధిస్తే అది వైసీపీపై ప్రభావం చూపించొచ్చంటున్నారు. విశాఖ విజయం నేపథ్యంలో చాలామంది వైసీపీని వీడి టీడీపీలోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు విశాఖలో టీడీపీ విజయం ఖాయమన్న అంచనాలు ఉండడం తెలిసిందే.

ఏపీలో కార్పొరేషన్‌ ఎన్నికలు వైకాపా సత్తాను చాటుకునేందు అవకాశంగానే కాకుండా ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగానూ మారనున్నాయి. గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై ఈ నెలాఖరులోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విశాఖపట్నం, భీమిలి మధ్య ఉన్న గ్రామాల విలీనానికి వ్యతిరేకంగా కోర్టులో ఉన్న కేసుల విషయంలో ఒక అంగీకారానికి రావడం ద్వారా ఎన్నికల నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తారు. అది తేలితే ఎన్నికలు నిర్వహిస్తారు.

కాగా సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ నియోజకర్గం నుంచి పోటీ చేసిన జగన్‌ తల్లి వై.ఎస్‌. విజయమ్మ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఇటీవలి కాలంలో అధికార టీడీపీ దూకుడుగా వెళుతూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేవారికి పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతోంది. దీంతో విశాఖ ఎన్నికలు అనగానే జగన్‌ కు చెమటలు పడుతున్నాయట.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు