ఎర్రబెల్లి కల నెరవేరబోతోంది

ఎర్రబెల్లి కల నెరవేరబోతోంది

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఒక వెలుగు వెలిగి...ఇటీవలే కారెక్కిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు కల నెరవేరనుందా? ఈమేరకు ఎర్రబెల్లి జరిపిన ముందస్తు చర్చల ఫలితంగా త్వరలోనే ఆయనకు మంత్రి పదవి దక్కనుందా? తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? అంటే ఎర్రబెల్లి సన్నిహితుల నుంచి అవుననే సమాధానం వస్తోంది.

తెలంగాణ టీడీపీలో, వరంగల్‌ జిల్లాలో ఎర్రబెల్లి బలమైన నేత అనే పేరుంది. అందుకే ఆయన రాకకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కేసీఆర్‌ ఓకే చెప్పడంతో తను నిర్వహిస్తున్న శాసనసభాపక్ష నేత పదవిని వదులుకొని మరి ఎర్రబెల్లి దయాకర్‌రావు గులాబీ గూటికి చేరారు. అంతేకాకుండా తమను టీఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తించాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ పరిణామాలతో పాటు త్వరలో వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ పరిణామాలన్నింటి రీత్యా ఎర్రబెల్లికి మంత్రిపదవికి కట్టబెట్టేందుకు సీఎం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వరంగల్‌ జిల్లా నుంచి ఇప్పటికే మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన, పర్యాటక శాఖామంత్రి చందూలాల్‌ ఉన్నారు. కొద్దికాలంగా ఆరోగ్య కారణాల వల్ల చందూలాల్‌ తన బాధ్యతలను సరిగా నిర్వహించలేకపోతున్నారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో చందూలాల్‌ బదులుగా జిల్లా కోటాలో ఎర్రబెల్లికి పదవి దక్కనుందని చెప్తున్నారు.

ఇదిలాఉండగా ఎర్రబెల్లికి మంత్రి పదవి ఇస్తే...ఫిరాయింపు కోటాలో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న రెండో ఎమ్మెల్యే ఎర్రబెల్లి అవుతారు. పార్టీ మారిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. నారాయణఖేడ్‌ ఉపఎన్నిక ఫలితాలు వెలువడ్డాక, త్వరలో జరగబోయే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లోపు మంత్రి వర్గ విస్తరణకు అవకాశమున్నట్లు చెప్తున్నారు. ఎర్రబెల్లి లైఫ్‌టైమ్‌ గోల్‌ను కేసీఆర్‌ నెరవేరుస్తారో చూడాలి మరి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు