ముద్రగడ ఎపిసోడ్‌ లో కట్టప్ప టైపు క్వశ్చన్‌

ముద్రగడ ఎపిసోడ్‌ లో కట్టప్ప టైపు క్వశ్చన్‌

కాపు గర్జన రణరంగంగా మారడం... కాపులు సంద్రంలా పోటెత్తడం.. ముద్రగడ పూనకంతో ఊగిపోయి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం... ఈపార్టీ ఆ పార్టీ అని లేకుండా నేతలంతా ముద్రగడకు సంఘీభావం ప్రకటించడం చూసి ఆయన ఉద్యమం మొదలుపెట్టగానే ఏపీ రాజకీయాల్లో భారీ కుదుపు వస్తుందేమో అని చాలామంది అనుకున్నారు.

కానీ చివరకు ఏమైంది... మహా తుపాను తీరం దాటిపోయి చిన్నచిన్న చినుకులతో సరిపెట్టుకున్నట్లుగా ముద్రగడ దీక్ష తుస్సుమంది. భారీ రేంజిలో బీరాలు పలికిన ముద్రగడ తన డిమాండ్లలో ఏమీ సాధించలేకపోయారు... ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని చెప్పడం తప్ప కొత్తగా చేసిందేమీ లేనప్పటికీ ముద్రగడ మాత్రం దీక్ష విరమించేశారు. దీనిపై హరిరామజోగయ్య వంటి కాపు నేతలు సీరియస్‌ గా ఉన్నారు కూడా. ముద్రగడ సాధించింది శూన్యమని ఆయన మండిపడుతున్నారు.

ముద్రగడ దీక్ష ప్రారంభమైన తరువాత పరిస్థితులు... ఆయన పెట్టిన డిమాండ్లు, వాటిపై ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ముద్రగడ ఏదో చేస్తారనుకుంటే ఇలా సరెండర్‌ అయిపోయారేంటన్న ఫీలింగ్‌ చాలామంది కాపుల్లో కనిపిస్తోంది.  కాపుల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 30ని వెంటనే అమలు చేయాలన్నది ముద్రగడ తొలి డిమాండ్‌... కానీ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చల్లో ఆ ఊసే రాలేదు.

రెండో డిమాండ్‌ మంజునాథన్‌ కమిటీ కాల వ్యవధి మూడు నెలలకు తగ్గించాలి. కానీ ఈ విషయంలోనూ ప్రభుత్వానిదే పై చేయి అయింది. ఏడు నెలల కాలపరిమితికి ముద్రగడ అంగీకరించారు. కాపు కార్పొరేషన్‌కు రెండేళ్ల కాలానికి బకాయి పడ్డ 1900 కోట్లు వెంటనే రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ ఆ డిమాండ్‌ కూడా గాల్లో కలిసిపోయింది.

ఈ ఏడాదికి అదనంగా మరో 500 కోట్లు కేటాయించేందుకు మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది. అంటే 1400 కోట్ల సంగతి మరిచారన్న మాట. తుని ఘటనలో నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కానీ దానిపైనా స్పష్టత లేదు. ముఖ్యమంత్రి మాత్రం తుని విధ్వంసానికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదంటున్నారు.  అన్నీ బేరీజు వేసుకుంటే మొత్తం ఎపిసోడ్‌ లో కాపుల ప్రయోజనాల విషయంలో ముద్రగడ ముద్ర ఏమాత్రం కనిపించలేదు. భవిష్యత్‌ తరాలు ముద్రగడ దీక్ష చేసి సాధించారు అని చెప్పడానికి ఒక్క ప్రయోజనమూ కనిపించలేదు.

అలాంటప్పుడు ఏమీ లేకుండానే ముద్రగడ ఎందుకు దీక్ష విరమించారన్నది అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది. ముందు రోజు వరకు బింకంగా ఉన్న ముద్రగడ ఒక్కసారిగా ఎందుకు ప్రభుత్వానికి లొంగిపోయారు... ఏకంగా చంద్రబాబు కాళ్లు కడుగుతానన్న స్థాయికి ఎందుకు దిగజారారన్నది అర్థం కాక కాపు నేతలు తలలు పట్టుకుంటున్నారు. పోనీ ప్రభుత్వం ఏమైనా ఎరగా చూపిందా అంటే అలా డబ్బుకు లొంగే మనిషే కాదు ముద్రగడ.

పార్టీలకు అతీతంగా ఎవరైనా అదే మాట చెబుతారు. మరి కేసులు పెడతామని బెదిరించారా అంటే ఆ భయమూ ఆయనకు లేదు. ఇంకేమైంది..? ముద్రగడను మార్చిన ఆ మ్యాజిక్‌ ఏంటి? ఇప్పుడు ఏపీలో ఎవరి నోట విన్నా ఇదే చర్చ. దీనిపైనే ఊహాగానాలు. ''కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు'' అన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకనట్లే... ''ముద్రగడ ఒక్కరోజులో మారిపోవడానికి కారణమేంటి'' అన్న ప్రశ్నకూ ఇంకా సమాధానం కోసం జనం బుర్రలకు పనిచెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు