భారత్ బంద్ కు పెరుగుతున్న మద్దతు

కేంద్రప్రభుత్వం ఆమోదించిన నూతన వ్యవసాయ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. దాదాపు నెలరోజులకు పైగా పంజాబ్, హర్యానాల్లో రైతులు కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంపై ఒత్తిడి పెంచటంలో భాగంగా పై రాష్ట్రాల్లోని రైతు సంఘాలు ఛలో డిల్లీ కార్యక్రమంలో ఉన్నాయి. దాదాపు 10 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో వంటా వార్పు లాంటి కార్యక్రమాలతో వేలాదిమంది రైతులు ఢిల్లీని ముట్టడించారు.

రైతుల ఆందోళనను గమనించిన కేంద్రం ఇప్పటికి మూడుసార్లు చర్చలు జరిపినా ఉపయోగం కనబడలేదు. కొత్త చట్టాన్ని ఉపసంహరించేది లేదన్న నిర్ణయం తీసుకుని రైతు సంఘాలతో సమావేశం అవుతున్న కారణంతోనే చర్చలు ఫెయిలవుతున్నాయి. చర్చలు ఎప్పుడైతే విఫలమయ్యాయో రైతులకు దేశవ్యప్తంగా మద్దతు పెరిగిపోతోంది. ఇందులో భాంగంగానే రైతు సంఘాలు ఇచ్చిన మంగళవారం భారత్ బంద్ కు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మద్దతు పెరుగుతోంది. ఎన్డీయేతర పార్టీలు కూడా తాజాగా రంగంలోకి దిగాయి. కాంగ్రెస్, శివసేన, టీఆర్ఎస్, ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.

రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు, వామపక్షాలతో పాటు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా రైతులకు మద్దతు ప్రకటించాయి. ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో భారత్ బంద్ కు తాము స్వచ్చంధంగా సహకరిస్తామంటూ ప్రభుత్వాలే ప్రకటించాయి. మెల్లిగా పంజాబులో మొదలైన రైతుల ఆందోళన చూస్తుండగానే డిల్లీదాకా పాకింది. రైతులతో మాత్రమే మొదలైన ఈ ఉద్యమం ఇపుడు ఎన్డీయేతర పార్టీలు, కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగుల సంఘాలతో పాటు నాన్ ఎన్డీయే ప్రభుత్వాల మద్దతు కూడగట్టేదాకా చేరుకుంది.

రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా నూతన వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించటాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రిస్టేజ్ గా తీసుకున్నట్లు కనబడుతోంది. ఒకవైపు రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్న కేంద్రం మరి అదే రైతులు చట్టాన్ని ఉపసంహరించమని అడుగుతుంటే ఎందుకు వెనకాడుతోంది. వాళ్ళడిగినట్లుగా రద్దు విషయాన్ని ఎందుకు ఆలోచించటం లేదు. అంటే నూతన వ్యవసాయ చట్టంలో అంబాని, అదానీ లాంటి కార్పొరేట్లకు మాత్రమే మేలు చేస్తుందనే రైతు సంఘాల ఆరోపణలు నిజమే అనే అనుమానాలు పెరుగుతున్నాయి. మరి కేంద్రం గనుక ఇలాగే మొండిపట్టుదలతో ఉంటే భవిష్యత్తులో తీరని నష్టం జరగటం ఖాయమనేమో.