డిప్యూటీ మేయర్‌గా సీమాంధ్ర కార్పొరేటర్‌?

డిప్యూటీ మేయర్‌గా సీమాంధ్ర కార్పొరేటర్‌?

ఏపీలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు.. తెలంగాణలోనూ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు... ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌ లోనూ అదే విధానం పాటించాలనుకుంటోంది తెరాస.  గ్రేటర్‌ హైదరాబాద్‌ లో ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎంపిక చేయాలనుకుంటోంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థలో ప్రస్తుతం మేయర్‌తోపాటు డిప్యూటీ మేయర్‌ పదవిని భర్తీ చేయాల్సి ఉంది. అయితే అదనంగా మరో డిప్యూటీ మేయర్‌ పోస్టును సృష్టించేందుకు జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, న్యాయ శాఖకు సంబంధించిన అధికారులతో మంతనాలు జరిపి నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన అధికారపక్షం తెరాస మరిన్ని పదవులను సృష్టించి తద్వారా కార్పొరేటర్లతో వాటిని భర్తీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం.

మేయర్‌ పదవి బీసీ జనరల్‌కు కేటాయించడంతో ఈ పదవికి తెరాసలో పోటీ అంతకంతకూ పెరుగుతోంది. దీంతోపాటు మైనారిటీ వర్గాలను,  హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులను సంతృప్తిపరిచేందుకు అదనంగా మరో డిప్యూటీ మేయర్‌ పదవిని సృష్టించి భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మేయర్‌ పదవి బీసీ జనరల్‌కు కేటాయించడంతో డిప్యూటీ మేయర్‌గా మైనారిటీ నేతను ఎంపిక చేయాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ మైనారిటీకి ఇవ్వడం కుదరకపోతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ పదవిని కట్టబెట్టాలని ప్రతిపాదించినట్టు సమాచారం. రెండవ డిప్యూటీ మేయర్‌ పదవిని సీమాంధ్ర కార్పొరేటర్‌కు ఇవ్వాలన్న ప్రతిపాదనపై కూడా చర్చోపచర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మేయర్‌, డిప్యూటీ మేయర్లలో ఒక పదవిని మహిళతో భర్తీ చేయాలన్న ప్రతిపాదన కూడా సీఎం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు