ముద్రగడ దీక్ష విరమణ

ముద్రగడ దీక్ష విరమణ

కాపు రిజర్వేషన్‌లపై గత నాలుగు రోజులుగా చేపట్టిన నిరాహార దీక్షను ముద్రగడ పద్మనాభం విరమించారు. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కళావెంకట్రావులు ముద్రగడ పద్మనాభంకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ఈ సందర్భంగా కాపుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగా ముద్రగడ పద్మనాభం సలహాలు, సూచనలు స్వీకరిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఆమరణ దీక్ష చేపట్టిన ముద్రగడకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని, ముద్రగడతో అన్ని విషయాలు మాట్లాడామని చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లు కాపు కమిషన్‌ వేశామని, యేటా ఎంత బడ్జెట్‌ కేటాయించాలనేది నిర్ణయిస్తామన్నారు. కమిషన్‌ కార్యకలాపాల వేగవంతానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. తుని ఘటనలో అమాయకులపై కేసులు పెట్టబోమని చెప్పారు.

కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి కొంత గడువు విధిస్తూ దీక్ష విరమించడానికి ముద్రగడ అంగీకరించారు. మొత్తానికి ముద్రగడ ప్రభుత్వానికి సమయమిస్తూ దీక్ష విరమించడంతో రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చల్లారినట్లయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు