కేసీఆర్ మ‌ర్చిపోయిన హామీ

 కేసీఆర్ మ‌ర్చిపోయిన హామీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. బల్దియా ఫలితాల సందర్భంగా తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్‌ ప్రజలు చరిత్ర తిరగరాస్తూ తీర్పు ఇచ్చారని కొనియాడారు. గ్రేటర్‌ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కేసీఆర్‌ చెప్పారు.

జీహెచ్‌ఎంసీ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా అతిపెద్ద మెజారిటీతో టీఆర్‌ఎస్‌ గెలుపొందిందని ఇప్పటి వరకు ఏ ఒక్కపార్టీ అధికారం చేపట్టిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన ఒక్క హామీ మినహా ప్రతి హామీని నెరవేర్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేశామని పునరుద్ఘాటించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఒక్కటే తమ ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని... ఆ పథకాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని చూస్తున్నామని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున గెలిచిన వారంతా యువకులేనని... ప్రజల నమ్మకాన్ని వారు నిలబెడతారని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో పేదవాడు లంచం లేకుండా ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకునే రోజు రావాలని ఆకాంక్షించారు. అలాంటపుడే వాళ్లు మనల్ని ఎన్నుకున్నందుకు సార్థకత చేకూరుతుందని స్పష్టం చేశారు.

ఇందు కోసం యువ కార్పొరేటర్లు కృషి చేయాలన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలీ, మంత్రి నాయిని నర్సింహరెడ్డి ఇందుకు సహకారం అందించాలని సూచించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. జంట నగరాల్లో ప్రజలు చాలా మంది తమకు సొంత ఇళ్లు కావాలని కోరుకుంటున్నారని తనకు తెలిసిందని కేసీఆర్‌ చెప్పారు. అందుకే ఏడాదిలో లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందు కోసం వచ్చే బడ్జెట్‌లోనే నిధుల కేటాయిస్తామని స్పష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు