కాపు గర్జన హింస: టెన్‌ హైలెట్స్‌

కాపు గర్జన హింస: టెన్‌ హైలెట్స్‌

కాపులను బీసీలో చేర్చాలని తూర్పుగోదావరి జిల్లా తునిలో చేపట్టిన కాపు ఐక్యగర్జన ఉద్రిక్తంగా మారింది. కాపునాడు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన ఈ సభ హింసాత్మక పరిస్థితులకు దారితీసిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హఠాత్తుగా సమావేశాన్ని ఏర్పాటుచేశారు.ఈ మొత్తం ఎపిసోడ్‌లో పది కీలక అంశాలు.

1. కాపులను బీసీల్లో చేర్చాలని, ఇది వెంటనే జరగాలని డిమాండ్‌ చేస్తూ ముద్రగడ పద్మనాభం రాస్తారోకో, రైల్‌ రోకోలకు పిలుపునివ్వడంతో కోల్‌కతా జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తుని వద్ద జాతీయ రహదారిపై ఓ వాహనంపై కూర్చుని ముద్రగడ ఆందోళన దిగడం, వేలాదిమంది కాపులు జాతీయ రహదారిపైకి రావడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
2. రైలు రోకోలో భాగంగా తూర్పుగోదావరిజిల్లా తుని రైల్వేస్టేషన్‌లో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళన కారులు నిప్పుపెట్టారు. దీంతో ఐదు రైలు బోగీలు దగ్ధం అయ్యాయి. దీంతో ఈ సంఘటనతో ఆ మార్గంలో వెళ్లాల్సిన విశాఖ, గోదావరి ఎక్స్‌ప్రెస్‌, పూరి - వోఖా ఎక్స్‌ప్రెస్‌, విశాఖ- కాకినాడ ప్యాసింజర్‌ రైల్లు నిలిచిపోయాయి. ఎలమంచిలి సమీపంలో రేగుపాలెం వద్ద హౌరా - చెన్నై మెయిల్‌ , సామర్లకోట రైల్వే స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌, పిఠాపురంలో సికింద్రాబాద్‌- గౌహతి ఎక్స్‌ప్రెస్‌లను కూడా ఆపివేశారు.

3.తుని ఘటన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ...కొందరు కావాలనే రాష్ట్రంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గతంలో పట్టిసీమ, అమరావతికి అడ్డుపడిన వారే ఇపుడు ఈ విధమైన చర్యల వెనుక ఉన్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను పాటుపడుతున్నానని...కాపులను బీసీల్లో చేర్చేందుకు టీడీపీ కట్టుబడి ఉందని చెప్పారు.

4. కాపులను ఇపుడే బీసీల్లో చేర్చవద్దని కొందరు కాపు నాయకులే కోరారని చంద్రబాబు వివరించారు. అన్ని రాజ్యాంగపరమైన చర్యలు తీసుకొని చిక్కులు ఎదురుకాకుండా చూడాలని చెప్పడం వల్లే తాను ఆగిపోయానని వివరించారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రతిపాదనతో వస్తే కాపులకు కోటా ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు.

5. తుని ఘటనపై పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ఈ ఘటన బాధాకరమని పేర్కొంటూ సోమవారం తాను మీడియా ముందుకువస్తున్నట్లు ప్రకటించారు.

6. తుని ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు సహా మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఉపముఖ్యమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి సహా సీనియర్‌ మంత్రులు స్పందిస్తూ....కావాలనే రెచ్చగొట్టే రీతిలో కొందరు ఈ తరహా చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

7.సీనియర్‌ మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావులు మాట్లాడుతూ..తునిలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హస్తం ఉందని ఆరోపించారు.

8. ఆందోళనకారులు తుని రూరల్‌ పోలీసుస్టేషన్‌పై దాడికి దిగి స్టేషన్‌కు నిప్పటించారు. ఈ దాడి ఘటనలో ఒక కానిస్టేబుల్‌ మృతి చెందాడు. సంఘటన గురించి డీజీపీ రాముడు సమీక్షించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కావాలని కొందరు రెచ్చగొడుతున్నారని, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా చర్యలు తప్పవని డీజీ హెచ్చరించారు.

9.రాస్తారోకో విరమించిన అనంతరం ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడుతూ..సోమవారం సాయంత్రంలోగా ప్రభుత్వం తరఫున ప్రకటన రాకపోతే...కఠిన నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించారు.

10.తుని సంఘటన నేపథ్యంలో రైల్వే ఆస్తులకు రక్షణ కల్పించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా ఏపీ డీజీపీ జేవీరాముడును కోరారు. సికిందరాబాద్‌ లోని రైల్‌ నిలయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇటు ఏపీ డీజీపీతో పాటు ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ తో రైల్వే జీఎం రవీంద్రగుప్త స్వయంగా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు