మేనల్లుడు ఎక్కడ కేసీఆర్‌?

మేనల్లుడు ఎక్కడ కేసీఆర్‌?

తన్నీరు హరీశ్‌ రావు. తెలంగాణ సీఎం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేనల్లుడిగానే కాదు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలోకి వచ్చే వరకు అన్ని సందర్భాల్లోనూ పార్టీలో నాయకుడిగా, సేవకుడిగా ఉన్న వ్యక్తి. కేసీఆర్‌ మేనల్లుడిగానే కాకుండా పరిణతి కలిగిన రాజకీయ నాయకుడిగా హరీశ్‌ రావు పార్టీని ఎన్నో ఇక్కట్ల నుంచి బయటపడేశాడు. తద్వారా ట్రబుల్‌ షూటర్‌ గా పేరు సంపాదించాడు.

అయితే ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో హరీశ్‌ రావును పూర్తిగా పక్కనపెట్టేశారనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ తనయుడు, పంచాయత్‌ రాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నీ తానై నగరంలోని ప్రాంతాలు తిరుగుతూ పరోక్ష గ్రేటర్‌ ఇంచార్జీగా ప్రచారంలోకి వచ్చారు. అయినప్పటికీ హరీశ్‌ రావు నొచ్చుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు. అయితే తాజాగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏకైక బహిరంగ సభలో హరీశ్‌ రావు కనిపించలేదు.

హరీశ్‌ రావుకు ఎన్నికల బాధ్యతలు అప్పగించకపోవడం అనే సంగతి పక్కనపెడితే ఆయనకు సరైన రీతిలో గౌరవం దక్కకపోవడం వల్లే ఆయన సమావేశానికి హాజరుకాలేదని వార్తలు వెలువడుతున్నాయి. సికింద్రాబాద్‌ సమీపంలోని అడ్డగుట్ట డివిజన్‌ కు హరీశ్‌ ఇంచార్జీగా ఉన్నారు. అంతే కాకుండా మెదక్‌ జిల్లాకు చెందిన పటాన్‌ చెరు నియోజకవర్గంలోని డివిజన్లు కూడా గ్రేటర్‌ పరిధిలోకి వస్తాయి. అక్కడ హరీశ్‌ రావు ప్రచారం కూడా చేశారు. అంతే కాకుండా పార్టీ తరఫున జరుగుతున్న ఏకైక బహిరంగ సభ అయినప్పటికీ హరీశ్‌ రావు హాజరు కాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది.

నారాయణ్‌ ఖేడ్‌ ఉప ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉండటం వల్లే హరీశ్‌ రావు హాజరుకాలేకపోయారని రాజకీయవర్గాలు భావిస్తున్నప్పటికీ...కరివేపాకు వలే తీసిపారేయడం వల్లే ఆయన దూరంగా ఉండిపోయారని చెప్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు