టీఆర్‌ఎస్‌లోకి సీమాంధ్ర సీనియర్‌ నేత

టీఆర్‌ఎస్‌లోకి సీమాంధ్ర సీనియర్‌ నేత

తెలుగు రాష్ట్ర సమితి...టీఆర్‌ఎస్‌ పేరును మార్చబోతున్నట్లు చెప్పిన సమయంలో రాష్ట్ర మంత్రి, సీఎం కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ సూచనప్రాయంగా చెప్పిన పేరు. సీమాంధ్రుల ఓట్ల కోసం ఈ ప్రతిపాదన తెరమీదకు వచ్చినందనేది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ....ఇపుడు ఏకంగా ఆంధ్రా నేతలే గులాబీ పార్టీ కండువా కప్పుకొంటున్నారు. అది కూడా చోటా మోటా నేతలు కాదు. ఏకంగా సీనియర్‌ మాజీ ఎమ్మెల్యే కావడం ఆసక్తికరం.

నూజివీడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లోనున్న సీమాంధ్రులు ఏడాదిన్నరకాలంలో ఎంతో సురక్షితంగా ఉన్నారని, మంచి వాతావరణాన్ని కల్పించిన టీఆర్‌ఎస్‌ను బలపర్చాలని రామకోటయ్య కోరారు. గ్రేటర్‌లో కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్నం రామకోటయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పటినుంచి తనకు మంచి మిత్రుడని, ఉద్యమ సమయంలో నైతికంగా మద్దతు ఇచ్చిన ఆయన.. ప్రస్తుతం పార్టీని నేరుగా బలపర్చడానికి ముందుకురావడం సంతోషమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరిన మొదటి సీమాంధ్ర నేత కావడం గమనార్హం.

టీఆర్‌ఎస్‌ లో మొదటిసారి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే స్థాయి నేత చేరిక ఇది మొదటిసారి. చిన్నం రామకోటయ్య తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు