అబ్బాయిలిద్దరికి ఎక్కడ చెడింది?

అబ్బాయిలిద్దరికి ఎక్కడ చెడింది?

గ్రేటర్‌ హైదరాబాద్‌.....అభివృద్ధికి తామే కారణం అని గత పాలకపక్షం చెప్తుంటూ...అసలైన అభివృద్ధి మేమే చూపిస్తామంటూ అధికారపార్టీ ప్రకటిస్తోంది. ఇలా గంభీర ప్రకటనలతో గ్రేటర్‌ వార్‌ కాస్తా తెలుగుదేశం వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అనే స్థాయికి చేరిపోయింది. ఆయా పార్టీల అధినేతలైన చంద్రబాబు, కేసీఆర్‌లు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యూహాలు రచిస్తుంటే, వారి తనయులు మాత్రం భిన్న అడుగులు వేస్తున్నారు. తాజాగా వారిద్దరి ప్రచారం పరస్పర పంచ్‌లు, విమర్శలు స్థాయికి చేరాయి.

పార్టీ అధినేతలుగా, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా విమర్శలు చేసుకోవడం సరైంది కాదనే భావనకు దాదాపుగా ఇద్దరు సీఎంలు వచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబు అయితే ఏకంగా పార్టీ శ్రేణులకు చెప్పేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ రాజకీయ వారసులుగా ఉన్న కేటీఆర్‌, లోకేష్‌లు తమ విజయానికి గట్టి పునాది వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే గ్రేటర్‌ ఎన్నికలను మార్గంగా ఎంచుకున్నారు. ఈ క్రమంలో వారసులుగా కేటీఆర్‌, లోకేష్‌ క్రియాశీలంగా ముందుకువెళుతున్నారు.

పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రులు అయిన చంద్రబాబు, కేసీఆర్‌ల మాటలను ఈ ఇద్దరు యువనేతలు తూ చా తప్పకుండా అమలుచేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగానే ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారానికి వెళుతున్నారు. సభలు పెడుతున్నా రు.పార్టీ శ్రేణుల కోసం సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఆయా చోట్ల నేరుగా కుల సంఘాల నేతలతో సమావేశమవుతున్నారు. సంక్షేమ సంఘాల ప్రతినిధులను కలుస్తున్నారు. ఇలా బొంగరంలా హైదరాబాద్‌ చుట్టూతా తిరుగుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా, అభ్యర్థుల కంటే ఎక్కువ ప్రచారం చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉన్న పరిస్థితులు అందుకు తగిన ఉదాహరణగా ఉన్నాయి.

ఇంతేకాదు 150 గ్రేటర్‌ డివిజన్లల్లో అడుగుపెట్టడానికి ఈ ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆయా చోట్ల ముఖ్యమైన నేతలను కలిసి ఓట్లు అడుగుతున్నారు. ఫోన్ల ద్వారా పలకరిస్తున్నారు. కొన్ని చోట్లకు తమకు నమ్మకమైన వారిని పంపించి వ్యవహారాలను చక్కబెడుతు న్నారు. హైదరాబాద్‌ అభివృద్ది చెందాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని కేటీఆర్‌ చెబుతుండగా, నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే కీలకమని లోకేష్‌ ప్రచారం చేస్తున్నారు. తండ్రుల బిజీవల్ల తనయులు కదనరంగంలో క్షణం తీరికలేకుండా గడుపుతున్నారని చెప్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు