కేసీఆర్‌, చంద్రబాబు.. ఎందుకు కలవలెదంటే?

కేసీఆర్‌, చంద్రబాబు.. ఎందుకు కలవలెదంటే?

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా గవర్నరు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు, విందులకు ముఖ్యమంత్రులు ప్రాధాన్యమిచ్చి ఆయన గౌరవార్థం తప్పనిసరిగా వస్తారు. కానీ, ఇద్దరు ముఖ్యమంత్రులు రాజ్‌ భవన్‌ ముఖం చూడలేదు. పైగా తాము రావడం లేదని గవర్నరుకు చెప్పలేదు కూడా. దీంతో వారిద్దరి రాకపోవడం వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

నిజానికి ఏడాది కిందట పరిస్థితుల ప్రకారం ఇద్దరు చంద్రుళ్ల మధ్య ఉన్న విభేదాలతో ఇద్దరు ఎదురెదురుపడేవారు కాదు. అందుకోసం ఇలాంటి కార్యక్రమాలకు డుమ్మా కొట్టడమో లేదంటే ఒకరు వెళ్లొచ్చిన తరువాత ఇంకొకరు వెళ్లడమో చేసేవారు. కానీ, గత కొద్దినెలలుగా ఇద్దరూ మంచి స్నేహంగా ఉంటున్నారు. అమరావతి శంకుస్థాపన, కేసీఆర్‌ యాగం సందర్భంగా ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరిగారు. ఆ తరువాత కూడా ఇద్దరు సీఎంలూ పలుమార్లు కలుసుకున్నారు. 

అలాంటప్పుడు గవర్నరు ఇచ్చిన తేనీటి విందుకు ఎందుకు రాలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. అందుకు గ్రేటర్‌ ఎన్నికలే కారణమని తెలుస్తోంది.  ఇద్దరు చంద్రుళ్ల మధ్య దోస్తీ నేపథ్యంలో తెలంగాణ టీడీపీలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించడం తగ్గించేశారు. టీటీడీపీ నేతల ఒత్తిడితో అక్కడి కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు సైలెంటుగా ఉంటూ పెద్దగా పోటీ పడడం లేదు. మొన్నమొన్న వరంగల్‌ ఉప ఎన్నికలోనూ టీటీడీపీ నేతలు ఎంత చించుకున్నా చంద్రబాబు మాత్రం అక్కడికి రాలేదు.. టీఆరెస్‌ ను, కేసీఆర్‌ ను పల్లెత్తు మాటనలేదు. అయితే.. తాజాగా గ్రేటర్‌ ఎన్నికలు అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి.

ఇక్కడ కూడా చంద్రబాబు దృష్టి పెట్టడం లేదు. అలా అని పూర్తిగా వదిలేస్తే హైదరాబాద్‌ లో ఉన్న సెటిలర్లు, పారిశ్రామికవర్గాల్లో టీడీపీ ఇమేజ్‌ పోతుందన్న ఉద్దేశంతో నామమాత్రంగా పోటీలో ఉంటున్నారు. చంద్రబాబు ప్రచారానికి వచ్చినా కేసీఆర్‌ ను ఏమీ అనలేదు. ఇక్కడి వ్యవహారాలను లోకేశే చూసుకుంటున్నారు. అయితే... గ్రేటర్‌ ఎన్నికల్లో రెండు పార్టీలు నేరుగా తలపడుతున్నందున ఇప్పుడు ఆ పార్టీల అధినేతలుగా వారిద్దరూ కలుసుకుని స్నేహగీతాలు పాడితే అది తప్పుడు సంకేతాలు పంపుతుందన్న ఉద్దేశంతోనే ఇద్దరూ రాలేదని తెలుస్తోంది.

అయితే.. రాకపోయినా గవర్నరుకు చూచాయగా సమాచారం ఇస్తే బాగుండేదని వినిపిస్తోంది.  గవర్నర్‌ కూడా  ఇద్దరు ముఖ్యమంత్రులు రాకపోవడానికి కారణాలు తనకు తెలియదంటూ కొంచెం ఆవేదనగానే చెప్పారు. ఇలా జరగడం తన గౌరవానికి భంగం కలిగిందన్న ఫీలింగులో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది.  మొత్తానికి ఈ దెబ్బకు.. ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయ అంశాల వద్దకు వచ్చేసరికి ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారన్నది గవర్నరుకు స్వయంగా అర్థమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English