ఏపీ మంత్రులు వర్సెస్‌ కోడెల

ఏపీ మంత్రులు వర్సెస్‌ కోడెల

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలపై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత క్రేజీగా మారింది. ప్రతి అసెంబ్లీ సమావేశాల సమయంలో సదరు సెషన్స్‌ హైదరాబాద్‌లో నిర్వహించాలా లేక ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాలా అనే డైలమా ఎదురవుతోంది.

ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సమావేశాలను ఏపీలో ఏర్పాటుచేసేందుకు శక్తిమేర ప్రయత్నం చేస్తుంటారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలను చూస్తుంటారు. ఇలాగే గతంలో ఆచార్య నాగర్జున యూనివర్సిటీ, హాయ్‌లాండ్‌లలో సమావేశాలు నిర్వహించడానికి సన్నద్ధం అయ్యారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం మేరకు హైదరాబాద్‌లోనే సమావేశాలు నిర్వహించారు!

త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు సైతం ఇదే రీతిలో డైలమా సాగింది. రాజధాని సమీపంలోని కేఎల్‌ యూనివర్సిటీలో బడ్జెట్‌ సమావేశాలు జరపాలని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు డిసైడయ్యారు. కేఎల్‌ వర్శిటీ ప్రాంగణాన్ని పరిశీలించారు కూడా. అయితే మళ్లీ సీన్‌ మారింది.! తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ ఎక్కడ జరపాలన్న విషయమై చర్చ జరిగింది.

కోడెల కేఎల్‌ వర్సిటీ సందర్శించింది ప్రస్తావనకు వచ్చినప్పటికీ....హైద్రాబాద్‌లో నే నిర్వహించాలని మెజారిటీ మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రైవేటు వర్శిటీలో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ ఏమిటని మంత్రులు సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. దీంతో బడ్జెట్‌ సమావేశాలను హైద్రాబాద్‌ లోనే నిర్వహించనున్నారు.


మొత్తంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వేదికగా కోడెల వర్సెస్‌ మంత్రులు అనే రీతిలో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఏపీ పొలిటికల్‌ సర్కిల్‌లో టాక్‌ వినిపిస్తోంది. ప్రతి అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇదే విధంగా స్పీకర్‌ కోడెల ఓ మాట అనటం...ముఖ్యమంత్రి వేరే నిర్ణయం తీసుకోవడం పరిపాటవడం ఇందుకు ఉదాహరణ అని చెప్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English