వాయిదా పద్దతుంది వైసీపీకి

వాయిదా పద్దతుంది వైసీపీకి

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వాయిదా పద్దతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నారు. కార్యక్రమాలను నిర్వహించడంలో క్లారిటీ లేకపోవడంతో జగన్‌ వేసే అడుగులు ఆయన రాజకీయ అపరిపక్వతను చాటుతున్నాయని పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. ముందుగా ఒక కార్యక్రమాన్ని అనుకోవడం..దానికో తేదీ ఖరారు చేయడం...తిరిగి దాన్ని మార్చేయడం...ఇలా వైసీపీ అంటే వాయిదాపద్దతికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిందని విమర్శిస్తున్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహించాలనుకున్న యువభేరీ తేదీని మార్చారు. పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా నేతలు ఇటీవల సమావేశమై ఈ నెల 21న యువభేరీ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ తాజాగా మరోసారి సమావేశమై యువభేరీ తేదీని 21కి బదులు 27న నిర్వహించాలని ఖరారు చేశారు. కార్యక్రమానికి సరిగ్గా ఒక్కరోజు ముందే తేదీని మారుస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో క్యాడర్‌లో ఒకింత అయోమయం నెలకొంది.

ఇదిలాఉండగా గత ఏడాది సైతం ఇదే తరహా అయోమయాన్ని జగన్‌ సృష్టించారు. నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించి ఆనక వాయిదావేశారు. వాడవాడలా...చిన్నా పెద్దా తేడాలేకుండా భాగస్వామ్యం అయ్యే  వినాయక చవితి పండుగ సమయంలో ఈ దీక్షను ప్రకటించి అనంతరం పార్టీ శ్రేణుల్లోనే గందరగోళం సృష్టించారు.

రాష్ట్ర బంద్‌ను మొదట ఇలాగే ప్రకటించి తేదీ మార్చారు. ఆఖరికి రాఖీ పౌర్ణమి రోజున రాష్ట్ర బంద్‌ నిర్వహించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. అధినాయకుడు సహా పార్టీ అగ్రనేతలు ప్రకటనలు చేసేముందు అన్నీ ఆలోచించుకోవాలని పార్టీ నేతలే  సూచిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English