పవన్‌ కేసుకు పసుపు రంగు

పవన్‌ కేసుకు పసుపు రంగు

జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా ''నాన్నకు ప్రేమతో'' నిర్మించిన బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ తనకు ఇవ్వాల్సిన పాత రెమ్యూనరేషన్‌ బకాయిలు ఇప్పించేలా చూడాలంటూ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మా అసోసియేషన్‌ కు కంప్లయింట్‌ చేయడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.  అయితే... పవన్‌ కంప్లయింట్‌ ను అడ్డంపెట్టుకుని మీడియాలో కొన్ని వర్గాలు చంద్రబాబు, బాలయ్యలపై దుష్ప్రచారానికి దిగుతున్నాయి. సిల్లీ ఇష్యూస్‌ ని లేవనెత్తుతూ అపోహలు సృష్టిస్తున్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ ఫిర్యాదు వెనుక చంద్రబాబు, బాలయ్యలు ఉన్నారని... వారి ఒత్తిడి, సూచనలతోనే పవన్‌ ఇప్పుడు నిర్మాతపై ఫిర్యాదు చేసి నాన్నకు ప్రేమతో సినిమాకు ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేశారని అభూతకల్పనలు రాస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు.

నాన్నకు ప్రేమతో సినిమా బుధవారం, బాలకృష్ణ నటించిన డిక్టేటర్‌ గురువారం రిలీజవుతున్నాయి. సంక్రాంతి బరిలో ఉన్న ఈ రెండు సినిమాల మధ్యే పోటీ ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సినిమాకు ఎన్టీఆర్‌ అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో బాలయ్య, ఆయన కోసం చంద్రబాబు ఇప్పుడు నాన్నకు ప్రేమతోకు ఆటంకాలు సృష్టిస్తున్నారన్నది ఆరపణ. అయితే.... ఇది ఎంత వరకు నిజం కావొచ్చన్నది పరిశీలిస్తే అబద్దం అనడానికే ఆధారాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు గత కొద్దిరోజులుగా తిండితినడానికి కూడా సమయం లేనంతగా బిజీగా ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన ఏమాత్రం ఖాళీగా లేరు. టీడీపీలో పెద్దపెద్ద నాయకులకే ఆయన అపాయింట్‌ మెంటు దొరకడం లేదు ఒక్కోసారి.

అంతేకాదు... సినిమాలు వంటివాటిని చంద్రబాబు చాలా చిన్నవిషయాలుగా తీసుకుంటారు. ఆ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకునే మనిషే కాదు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో జూ.ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబుకు కానీ, లోకేశ్‌ కు కానీ, బాలయ్య కు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు.

ఇక పవన్‌ విషయమే తీసకుంటే ఆయనకు అసలే తిక్క అంటారు. ఒకరు చెబితే వినే రకం కాదు. రాజకీయ అంశాల్లో అయితే ఆ ఫీల్డుకు చెందినవారు కాబట్టి చంద్రబాబు చెప్పినట్లు చెయ్యొచ్చేమో కానీ సినిమాల విషయంలో చంద్రబాబు, బాలయ్యలు చెప్పినట్లుగా ఆడే మనిషి కాదాయన.

ఇలా ఏ రకంగా చూసినా పవన్‌ కంప్లయింట్‌ వెనుక చంద్రబాబు హస్తం ఉందనడానికి ఆధారాలే కనిపించడం లేదు. అయినా.... మీడియాలో ఒక వర్గం మాత్రం దీనికి పసుపు రంగు పులుముతోంది. సోషల్‌ మీడియాలోనూ ఈ భావజాలాన్ని ఎక్కించడానికి ప్రయత్నిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు