ఇలాచేస్తే ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమమూ వస్తుంది

ఇలాచేస్తే ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమమూ వస్తుంది

సెంట్రల్‌ ఆంధ్ర నాయకులు ఇతర ప్రాంతాల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తారన్నది ఎంతోకాలంగా ఉన్న మాట. తెలంగాణ ఏర్పాటుకు కూడా అదే మూలం.  కేవలం ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతూ మిగతా ప్రాంతాలు వెనుకబడి పోవడంతో తెలంగాణలో ఉద్యమం మొదలై ఏకంగా రాష్ట్రం విడిపోవడానికి కారణమైన సంగతి తెలిసిందే.

అయినా కూడా సెంట్రల్‌ ఆంధ్ర నేతల తీరుమారడం లేదని తాజాగా రుజువైంది. ఇప్పటికే రాయలసీమ నేతలు ఈ విషయం గ్రహించి అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా తాజాగా ఉత్తరాంధ్ర నేతలూ మండిపడ్డారు. ఇప్పటికైనా సెంట్రల్‌ ఆంధ్ర నేతల తీరు మారకపోతే ఉత్తరాంధ్రలో ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు విశాఖపట్నాన్ని చిన్నచూపు చూస్తూ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. విజయవాడలో రైల్వే జీఎంతో జరిగిన ఎంపీల సమావేశం అనంతరం రాయపాటి వ్యాఖ్యలు చేశారు. విశాఖ రైల్వే జోన్‌ కోసం ఉత్తరాంధ్ర ఎంపీలు సమావేశంలో డిమాండ్‌ చేయగా రాయపాటి జోక్యం చేసుకున్నారు. తుపాన్లు ముంచెత్తే విశాఖకు రైల్వే జోన్‌ అవసరమా అని వ్యాఖ్యానించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 సొంత రాష్ట్ర ఎంపీయే ఇలా అనే సరికి ఎంపీలంతా కాసేపు కంగుతిన్నారు. తేరుకున్న ఉత్తరాంధ్ర ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, అవంతి శ్రీనివాస్‌లు రాయపాటిపై విరుచుకుపడ్డారు.  ''తుపాన్ల పేరు చెప్పి రైల్వేజోన్‌ను కూడా ఎగురేసుకుపోదామనుకుంటున్నారా,  ఏం మాట్లాడుతున్నారు?'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

''కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ తరచూ తుపాన్లు వస్తున్నాయి అంత మాత్రమే అక్కడ రాజధాని కట్టవద్దని మేం అభ్యంతరం చెప్పామా అని నిలదీశారు. బాధ్యతగా మాట్లాడండి '' అని హితవు పలికారు. వివాదం పెద్దదవుతుందని భావించిన ఇతర ఎంపీలు జోక్యం చేసుకుని ఉత్తరాంధ్ర ఎంపీలను శాంతింపజేశారు. రాయపాటి వ్యాఖ్యలపై ఉత్తరాంధ్రవాసులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాయపాటి అహంకారానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని మండిపడుతున్నారు.

వెనుకబడిన ప్రాంతాలంటే ఎందుకంత చిన్నచూపు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎవరూ పట్టించుకోని ఉత్తరాంధ్రను ఇప్పుడు చంద్రబాబు అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంటే రాయపాటి వంటివారు ఉత్తరాంధ్రకు శత్రువులుగా మారుతున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబు జోక్యం చేసుకుని రాయపాటి వంటివారిని మందలించకపోతే ఇది ఇబ్బందికరంగా మారే ప్రమాదముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు