కేటీఆర్‌ను కిందికి దించారు

కేటీఆర్‌ను కిందికి దించారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు, రాష్ట్రమంత్రి కేటీఆర్‌ ఎట్టకేలకు కిందికి దిగారు! గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల అనధికార బాధ్యుడిగా ఉన్న కేటీఆర్‌ నగరంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, తెలంగాణ ఏర్పాటుకు టీఆర్‌ఎస్‌ చేసిన కృషిని వివరించడంతో పాటు నాయకులను చేర్చుకోవడం వంటి విభిన్నమైన కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ కేటీఆర్‌ బిజీబిజీగా మారిపోయారు.

ఈ క్రమంలో పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేస్తున్న కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకోవడంలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు తమ వంతు కృషిచేశారు. శిలాపలకంలో కేటీఆర్‌ పేరు అందరికంటే పైన ఉంచి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, సీనియర్‌ మంత్రులు నాయిని, తలసాని, పద్మారావు వంటివారిని కిందికి నెట్టేశారు. ఇది ప్రొటోకాల్‌ కు విరుద్ధం. అయితే యువరాజుకు దక్కుతున్న ప్రాధాన్యం గురించి గులాబీ నాయకులు సైలెంటుగా ఉన్నా ఈ పాయింటుపై ప్రతిపక్షాలు కేటీఆర్‌ ను లాక్‌ చేశాయి. ముఖ్యంగా బీజేపీ భగ్గుమంది. కేంద్రమంత్రి హోదాలో ఉన్న బండారు దత్తాత్రేయ హాజరవుతుంటే రాష్ట్ర మంత్రి అది కూడా జిల్లా బాధ్యుడు కూడా కానీ కేటీఆర్‌ పేరు ఎలా అందరికంటే పైన వేస్తారంటూ ప్రొటోకాల్‌ లాజిక్‌ లాగారు.

ఈ విమర్శలపై నాలుక్కరుచుకున్న కేటీఆర్‌ స్పందించారు. ''శంకుస్థాపన శిలాపలకాల్లో నా పేరు పైన ఉంచడం అధికారుల పొరపాటు వల్ల జరిగింది. దానిపై వారితో మాట్లాడితే...ప్రత్యేక అతిథి కాబట్టి అలా ఉంచామన్నారు. దాన్ని సరిదిద్దాలని కోరాను. పేరు అలా ఉంచడం ఎవరినైనా నొప్పించి ఉంటే నేను వ్యక్తిగతంగా....పత్రికాముఖంగా క్షమాపణ కోరుతున్నాను'' అని కేటీఆర్‌ అని అన్నారు. చిత్రంగా ఆయన స్పందించిన మరుసటి రోజు జరిగిన కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ పేరును ముఖ్యఅతిథిగా చేర్చారు. కేటీఆర్‌ పేరును మిగతా మంత్రులతో సహా కిందికి దించారు. ఆ విధంగా కేటీఆర్‌ను బీజేపీ కిందికి దించగలిగిందని కమలనాథులు ఖుష్‌ అవుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు