ఆంధ్రుల ఓట్లపైనే అందరి కన్ను

ఆంధ్రుల ఓట్లపైనే అందరి కన్ను

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ లో నివశిస్తున్న దాదాపు 30 లక్షలకు పైగా ఆంధ్రుల ఓట్లపైనే ఇప్పుడు అన్ని పార్టీలూ కన్నేశాయి. వారి ఓట్లను దక్కించుకొనే దిశగా పావులు కదుపుతున్నాయి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దాదాపు మూడోవంతు ఓట్లు ఆంధ్రులవి ఉంటాయని అంచనా. సాధారణంగా హైదరాబాద్‌ లోని ఆంధ్రులు, విద్యావంతులు కలిపి టీడీపీ, బీజేపీ కూటమికి ఓట్లు వేస్తారనే అభిప్రాయం ఇప్పటికే గూడుకట్టుకుపోయింది. దీనికితోడు చంద్రబాబు మీద అభిమానంతోపాటు మోద మానియా కూడా ఉంటుందనే భావన ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రులు, విద్యావంతుల ఓట్లన్నీ కూడా గుండుగుత్తగా ఒకే పార్టీ లేదా కూటమికి పడితే మిగిలిన పార్టీలకు ఇబ్బందే. వాటి గెలుపు అవకాశాలూ క్షీణిస్తాయి. ఇక ఆంధ్రుల ఓట్లన్నీ టీడీపీ, బీజేపీ కూటమికి పడతాయనే ధీమా ఆ రెండు పార్టీల్లో ఉంటే వారి ఓట్లపైనే ఇప్పుడు అధికార టీఆర్‌ఎస్‌, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ కన్నేశాయి.

గ్రేటర్‌ ఎన్నికల్లో ఆంధ్రుల ఓట్లతోనే తాము గెలుస్తామని, ఆంధ్రులు హైదరాబాద్‌ లో గత ఏడాదిన్నరగా ఎటువంటి దాడులూ లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారని సాక్షాత్తూ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. వారు లేనప్పుడు కాకుండా ఆంధ్రులు సంక్రాంతికి వెళ్లి వచ్చినతర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని కూడా చెప్పారు. తద్వారా, ఆంధ్రుల్లో సానుకూలత తెచ్చుకోవాలన్నదే టీఆర్‌ఎస్‌ వ్యూహంగా చెబుతున్నారు. ఆంధ్రుల ఓట్లను కొన్నిటిని చీల్చినా తమ వ్యూహం ఫలిస్తుందని, టీడీపీ, బీజేపీ కూటమికి గండి పడుతుందనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.

ఇక, ఆంధ్రప్రదేశ్‌ ను విభజించింది కాంగ్రెస్‌ పార్టీ అనే కోపం, ఆగ్రహం ఆంధ్రుల్లో ఉందని తెలిసినా కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌ లోని ఆంద్రుల ఓట్లపై కన్నేసింది. ఎన్నికల తర్వాత కేసీఆర్‌ అసలు స్వరూపం బయట పెట్టుకుంటారని, ఆంధ్రులపై దాడులు చేస్తారని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పరోక్షంగా చెప్పారు. ఆంధ్రా వాలో బాగో అని అన్నారని, అభద్రతా భావాన్ని స ష్టించారని గుర్తు చేశారు. ఆంధ్రుల ఓట్లను తొలగిస్తే తామే పోరాడామని చెబుతున్నారు. మొత్తంమీద హైదరాబాద్‌ లో ఇప్పుడు ఆంద్రుల ఓట్లు కీలకంగా మారాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు