నాన్నకు ప్రేమతో.. బాబాయిపై కసితో !

నాన్నకు ప్రేమతో.. బాబాయిపై కసితో  !

ఎన్టీఆర్‌ తనయుల్లో చాలాకాలంగా వర్గాలున్నా తాజాగా నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్‌ దాన్ని స్పష్టం చేసింది. ఎన్టీఆర్‌ ను పక్కకు తప్పించి టీడీపీని చేతిలోకి తీసుకుని హోల్‌ అండ్‌ సోల్‌ గా నారావారి పార్టీగా మార్చేసిన టీడీపీలో రాజకీయాలు ఎన్టీఆర్‌ కుటుంబ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు హీరో బాలకృష్ణ చంద్రబాబుతో వియ్యమొందడం, టీడీపీ టిక్కెటుపై ఎమ్మెల్యేగా గెలుపొందడం... టీడీపీ భవిష్యత్తు నేత, భవిష్యత్తు ముఖ్యమంత్రిగా భావిస్తున్న లోకేశ్‌ కు మామగారిగా పూర్తిగా చంద్రబాబు గుప్పిట్లో ఉన్నారు.

మరోవైపు తాత గారి నట వారసత్వం పుణికిపుచ్చుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ తొలి దశలో పార్టీపైనా ఆశలు పెట్టుకున్నారు. అయితే... రాజకీయం అనుభవశూన్యత కారణంగా దాన్ని చాలా తొందరగా బయటపెట్టుకుని చంద్రబాబు ఆగ్రహానికి గురై పూర్తిగా పార్టీకి దూరం కావాల్సివచ్చింది. హరికృష్ణ కూడా ఒక రకంగా పార్టీకి దూరమయ్యారనే చెప్పాలి. రాజ్యసభ పదవీ కాలం ఆయనది పూర్తికావడం... ఇటీవల ఆయన మరోసారి రాజ్యసభ సభ్యత్వం దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నా కూడా చంద్రబాబు నుంచి సానుకూల స్పందన లేకపోవడం తెలిసిందే. బాలకృష్ణ వైపు నుంచి కూడా జూ.ఎన్టీఆర్‌, హరికృష్ణలకు పూర్తిగా సహాయ నిరాకరణే ఉంది.

ఇది చాలదన్నట్లుగా లోకేశ్‌ కూడా ఎన్టీఆర్‌ తో ఎప్పటికైనా ముప్పేనని భావిస్తూ తొక్కే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఆ ధోరణి గమనించే టీడీపీ వైపు నుంచి ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు తగ్గిపోయారు. బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా ఇప్పుడు జూనియర్‌ అభిమాన బృందంలో లేరు. ఇలాంటి సమీకరణల కారణంగా జూనియర్‌ సినిమాలు ఏ మాత్రం ఫ్లాపయినా కనిపించకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో కెరీర్‌ పరంగా, కుటుంబం పరంగా జూనియర్‌ ఒంటరయ్యారు.

అదేసమయంలో హరికృష్ణ కూడా నందమూరి కుటుంబంలోనే రాజకీయంగా ఒంటరయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, బాలయ్య వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని... వారితో మంచిగా ఉండాలని ప్రయత్నించి కూడా లాభం లేదని గుర్తించి హరికృష్ణ కుటుంబంగా కళ్యాణ్‌ రాం, జూనియర్‌ లు పెద్ద ఎన్టీఆర్‌ పేరుతో తమ అభిమాన వర్గాన్ని పట్టి నిలుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఎలాగూ తనకు సహకరించని బాబాయి అభిమానుల కారణంగా... బాబాయిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్‌ భావిస్తున్నట్టు నిన్న స్పష్టమైంది. ఎందుకంటే మొదటి సారి బాబాయ్‌ అనే మాట ఎత్తకుండా ఎన్టీఆర్‌ నిన్నటి ఆడియో ఫంక్షను ముగించారు. కొడుక్కంటే అల్లుడెక్కువని భావించిన బాబాయిపై ఇగ్నోరెన్స్‌ అనే కసిని ప్రదర్శించారు ఎన్టీఆర్‌.

ఇందులో ఇంకో కోణమూ కనిపిస్తోందని రాజకీయవర్గాల్లో అప్పుడే చర్చ మొదలవుతోంది. ఎన్టీఆర్‌ కొడుకైన హరికృష్ణకు కనీసం రాజ్యసభ సీటు కూడా ఇవ్వకపోతే అంతకంటే అవమానం ఉండదని... అలాంటప్పుడు ఆయన అవసరమైతే వైసీపీయో, బీజేపీలోనో చేరిన సందర్బం కూడా రావొచ్చని... అప్పటికంటూ సొంత వర్గం ఉండాలన్న ఉద్దేశం కూడా ఇందులో ఉందని అంటున్నారు.

మరి... జూనియర్‌ తన కొత్త సినిమాతో ''నాన్నకు ప్రేమతో'' ఎలాంటి కానుక ఇస్తారో చూడాలి. రాజకీయ బలం కల్పిస్తారో.. హరికృష్ణ కుటుంబంగా అంతా కలిసికట్టుగా ఉండేలా చేస్తారో చూడాలి. మొత్తానికి నందమూరి ఫ్యామిలీలో ''నాన్నకు ప్రేమతో'' కొత్త ట్రెండు సృష్టించడం ఖాయమని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు