విజయవాడ ప్రజల వల్లే తెలంగాణ : రాధాకృష్ణ

విజయవాడ ప్రజల వల్లే తెలంగాణ : రాధాకృష్ణ

ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు నగరం విజయవాడ ప్రజలపై తీవ్ర ఆరోపణ చేశారు. సమైక్యాంధ్ర కోసం కంకణం కట్టుకుని పోరాడిన అచ్చ తెలుగు బిడ్డలపై అభాండాలు వేశారు. అవును... తాజాగా ఆదివారం ఆయన తన పత్రికలో 'కొత్త పలుకు' పేరుతో రాసిన వ్యాసంలో విజయవాడ ప్రజలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం రావడానికి, తెలంగాణ ఏర్పడడానికి కారణం విజయవాడ ప్రజలేనని... విజయవాడ ప్రజలది ఫక్తు వ్యాపార స్వభావమని అంటారంటూ ఆయన తన వ్యాసంలో రాసుకొచ్చారు.  అసెంబ్లీతో ఆరంభించి కాల్‌ మనీ వ్యాపారంపై కథ మొదలుపెట్టిన ఆయన అట్నుంచి అటు విజయవాడ వైపు మళ్లి తన అక్కసునంతా తీర్చుకున్నట్లుగా కనిపిస్తోంది. విజయవాడలో భూముల ధరలు పెరిగిపోవడంపైనా ఆయన చాలా ఆవేదన వ్యక్తంచేశారు... మరి, ఆయనకు అక్కడ ఏ డీల్‌ కుదరలేదో ఏమో?

విజయవాడలో కాల్‌ మనీ వ్యాపారం ఉండడంలో ఆశ్చర్యం లేదని.. అక్కడ బందరు రోడ్డులో గజం ధర రూ.3 లక్షలు పలుకుతోందని, అంత ధర పెట్టి కొని ఏ వ్యాపారం చేసినా గిట్టుబాటు కాదు కాబట్టే కాల్‌ మనీ వంటి వ్యాపారాలు చేస్తున్నారన్నట్లుగా ఆయన రాసుకొచ్చారు. నిజాంల కాలం నాడే విజయవాడ ప్రజలు తెలంగాణవారిని దోచుకున్నారనీ రాధాకృష్ణ ఆరోపించారు. నిజాం కాలంలో ఆ దాష్టీకాలను తట్టుకోలేక చాలామంది తెలంగాణ నుంచి విజయవాడకు వచ్చేవారని, అలా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సింది పోయి అప్పట్లో వారి నుంచి భారీగా అద్దెలు తీసుకునేవారని రాదాకృష్ణ చెప్పుకొచ్చారు.

మొత్తానికి విజయవాడను జనాలను పీక్కుతినే ప్రజలున్న నగరంగా.... ఆంధ్రప్రదేశ్‌ విభజనకు కారణమైన ప్రజలున్న నగరంగా చిత్రీకరించేందుకు రాధాకృష్ణ శాయశక్తులా ప్రయత్నించినట్లుగా కనిపించింది. విజయవాడపై రాధాకృష్ణకు అంతగా ఎందుకు కోపమొచ్చిందన్న విషయంలో చాలా రూమర్లు వినిపిస్తున్నాయి. కోరుకున్న ధరలకు అక్కడ ఎవరూ భూములు ఇవ్వకపోవడంతో రాధాకృష్ణకు విజయవాడ కానిదైపోయిందని అంటున్నారు ఆయన గురించి తెలిసినవారు.

మరి విజయవాడ ప్రజలు రాధాకృష్ణ వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారో చూడాలి. సర్లే అని వదిలేస్తారో లేదంటే ఆయన అనుకుంటున్నట్లే వ్యవహరించి బుద్ధి చెప్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు