రాష్ట్రపతి పదవిపై రామోజీరావు కన్ను

రాష్ట్రపతి పదవిపై రామోజీరావు కన్ను

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయి రాజకీయాల్లో తన మాట నెగ్గించుకునే సత్తా ఉన్న ఈనాగు గ్రూపు అధినేత రామోజీ రావు గురించి కొత్త విషయం ఒకటి ప్రచారంలోకొచ్చింది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడే కాకుండా కేంద్రంలోని బీజేపీ పెద్దలు, ఆరెస్సెస్‌ పెద్దలతో మంచి సంబంధాలున్న రామోజీ దేశ అత్యున్నత పదవికి గురిపెట్టారని వినిపిస్తోంది.

తన సుదీర్ఘ ప్రస్థానంలో ఇంతవరకు పదవులు, అవార్డుల జోలికి పోని ఆయన ఇటీవల పురస్కారాలపై మనసు పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన డాక్టరేట్‌ కూడా తీసుకున్నారు. త్వరలో ఆయన పద్మవిభూషణో.. పద్మ భూషణో వస్తుందనీ అంటున్నారు. అయితే... ఇవన్నీ చాలా చిన్నవని , ఆయన టార్గెట్‌ చాలా పెద్దదని ఆయన సన్నిహిత వర్గాల నుంచే వినిపిస్తోంది. రామోజీ ఏకంగా రాష్ట్రపతి పదవికి గురి పెట్టారని చెబుతున్నారు.

రామోజీ రాష్ట్రపతి పదవి కోరుకుంటున్నారన్న ప్రచారం మొదలయ్యాక ఇటీవల పరిణామాలను కొందరు విశ్లేషించి నిజమే కావొచ్చని అంటున్నారు. ఆయన ఇటీవల తరచూ  ప్రధాని, కేంద్రంలోని పెద్దలను కలుస్తున్నారు. ఓం సిటీ పేరుతో ఒకట్రెండు సార్లు భేటీ అయిన ఆయన ఆ తరువాత ఇటీవల స్వచ్ఛ భారత్‌ కోసం ఈనాడు చేసిన లక్షలాది కార్యక్రమాలను ఆల్బమ్‌ చేయించి ప్రధానిని కలిశారు. ఆ సందర్భంగా రామోజీని చూసి దేశంలోని ప్రతి పొలిటీషియన్‌ ఆశ్చర్యపోయాడు.

స్వచ్ఛభారత్‌ ను ఆ స్థాయిలో చేసినవారు ఇంకెవరూ లేకపోవడం ఒకెత్తయితే... ఆ రోజున రామోజీ సూటుబూటుతో సరికొత్త అవతారంలో కనిపించడం మరో ఎత్తు. ఎప్పుడూ తెల్ల దుస్తుల్లో, చివరికి షూ కూడా తెల్లనిదే వేసే రామోజీ ఆ రోజు మాత్రం రంగు మార్చారు. కార్పొరేట్‌ స్టైల్లోనూ కనిపించారు. దానికి రకరకాల భాష్యం చెప్పారు అంతా. కానీ, ఆయన తనలోని భిన్న కోణాలను చూపించేందుకు గాను... రాష్ట్రపతిగా ఎన్నికైతే ప్రపంచదేశాల నేతలతో కలిసే సందర్భాల్లో ఇలా కనిపించగలనని చెప్పేందుకు ఆ డ్రెస్‌ లో వెళ్లారని అంటున్నారు.

మోడీని ఆకట్టుకునేందుకు రామోజీ స్వచ్ఛభారత్‌ ను పెద్ద స్థాయిలో చేయిస్తున్నారని... మోడీ వద్ద తనను ప్రమోట్‌ చేసేందుకు తన పేపర్లో వెంకయ్యనాయుడుకు బాగా ప్రయారిటీ ఇస్తున్నారని అంటున్నారు. మోడీ కూడా రాష్ట్రపతి రేసులో ముందున్న అద్వానీకి చెక్‌ పెట్టేందుకు సరైన వ్యక్తి కోసం చూస్తున్నారని.. అది రామోజీ అనిపించేలా చేయాలన్నదే రామోజీ ప్రయత్నమని వినిపిస్తోంది.

గతంలో ఎన్డీయే ప్రభుత్వమే రాజకీయాలతో సంబంధంలేని అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిని చేసింది. ఇప్పుడు కూడా సమీకరణాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని రామోజీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు కానీ రామోజీ అయితే గట్టిగా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు