అసమ్మతికి ఈ నేత మారుపేరా ?

ఏ పార్టీలో ఉన్నా ఈనేత తీరు మారటం లేదు. అవసరానికి పార్టీ మారటం వెంటనే సదరు పార్టీలోని నేతలను డామినేట్ చేయటం. దాంతో పార్టీలో అసమ్మతి మొదలైపోవటం. గడచిన నాలుగు దశాబ్దాలుగా ఇదే తీరుతో ఈనేత రాజకీయాలను నెట్టుకొచ్చేస్తున్నారు. ఇంతకీ సదరు నేత ఎవరో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ప్రకాశం జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరనే చెప్పాలి. రాయలసీమ లేదా గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాల్లాగ ఈ జిల్లాలో గొడవలుండవు. కాకపోతే ఏదో ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రం కాస్త గొడవలున్నాయంతే.

అప్పుడెప్పుడో అంటే నాలుగు దశాబ్దాల క్రితం జిల్లాలో బాగా ప్రాచుర్యం ఉన్న గొట్టిపాటి హనుమంతరావు నుండి ఇప్పటి ఆమంచి కృష్ణమోహన్ వరకు అందరితోను గొడవలే. తన మాట చెల్లుబాటు కావటంలేదని అనుకుంటే చాలు ఇక వివాదాలు మొదలుపెట్టడమే. ఈ నేత దెబ్బకు కొందరు నేతలు ఇతర పార్టీలకు వదిలి వెళ్ళిపోతే మరికొందరు నేతలు ఎదురుతిరిగారు. ఏదేమైనా ఈ నేత ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో రెగ్యులర్ గా వివాదాలే అనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

జిల్లా రాజకీయాల్లో ఎంతో సౌమ్యునిగా పేరున్న ఈదర హరిబాబుతో కూడా ఈ సీనియర్ నేతకు నిత్యం గొడవలే. కొండెపి నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ గుండపనేని అచ్యుత్ కుమార్ తో కూడా ఈ సీనియర్ కు పడలేదు. ఇక జిల్లాలోనే సీనియర్ నేతల్లో ఒకరైన బాచిన చెంచుగరటయ్యతో కూడా ఈనేతకు పడలేదు. దాంతో సదరు సీనియర్ నేత గొడవలకు తట్టుకోలేక చివరకు బాచిన పార్టీనే మారిపోయారు.

2014లో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దామచెర్ల జనార్ధన్ తో కూడా సీనియర్ కు పడలేదు. దాంతో నిత్యం గొడవలే. ఈ సీనియర్ నేత ఎవరితో గొడవలు పెట్టుకున్నా దాని ప్రభావం మొత్తం జిల్లాలోని నేతలందరిపైనా పడుతుంది. ఎలాగంటే జిల్లా పార్టీ సమావేశాల్లో రెగ్యులర్ గా పంచాయితీ జరగాల్సిందే. దాంతో నేతలు వర్గాలుగా విడిపోవాల్సొచ్చేది. నాలుగు సార్లు ఎంఎల్ఏ గా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ తో ఇపుడు గొడవలవుతున్నాయి. కాకపోతే గొట్టిపాటి ఎదురుతిరగటంతో ఇద్దరి మధ్య వివాదాలు తీవ్రస్ధాయికి చేరుకున్నాయి. దాంతో ఒకరి వర్గంపై మరొకరి వర్గం దాడులు చేసుకుంటోంది.

అయితే గొట్టిపాటి దెబ్బకు తట్టుకోలేక ఈ సీనియరే చివరకు పార్టీ మారిపోవాలని అనుకున్నారని టాక్. అయితే మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏగా గెలవటంతో అధికారపార్టీలోకి వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయారు. అయితే అప్పటికే ఎంఎల్ఏగా పోటీ చేసి ఓడిపోయిన నేత ఉండటంతో ఇపుడు ఇద్దరి మధ్య ప్రతిరోజు గొడవలవుతున్నాయి. మరి నాలుగు దశాబ్దాల అనుభవం అని చెప్పుకునే ఈ నేత తన అనుభవాన్ని జిల్లా అభివృద్ధికి కాకుండా ప్రత్యర్ధులపై ఆధిపత్యం కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. దాంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. ఇప్పటికైనా ఈ నేత వివాదాలపైన కాకుండా తనకున్న పలుకుబడిని జిల్లా అభివృద్ధికి ఉపయోగిస్తే బాగుంటుందని జిల్లా ప్రజానీకం ఆశిస్తున్నారు.