అన్నిట్లో వేలుపెట్టి చెయ్యేందుకు కాల్చుకుంటారు బాబు?

అన్నిట్లో వేలుపెట్టి చెయ్యేందుకు కాల్చుకుంటారు బాబు?

ఇంగ్లిష్‌లో ప్రముఖ సామెత ఒకటుంది. మనందరికీ తెలిసిందే. జాక్‌ ఆఫ్‌ ఆల్‌...మాస్టర్‌ ఆఫ్‌ నన్‌ అని. అన్నింట్లో ప్రవేశం ఉండి ఒక్కదానిపై కూడా పట్టులేకపోవడం అనే సందర్భంలో ఇది వాడుతారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ సామెత వర్తించకపోయినా.... సందర్భానికి మాత్రం తగినట్లు సూటవుతుందని అంటున్నారు!! అచ్చా?...ఆంధ్రా ముఖ్యమంత్రి ఆంగ్లం సామెత వర్తింపచేయాల్సిన సందర్భం ఎందుకొచ్చిందో. పైగా ఒక్కదానిపైన కూడా పట్టులేకుంటే...

అనుభవజ్ఞుడు అయిన సీఎంగా చంద్రబాబు గుర్తింపు పొందారా?  హైదరాబాద్‌ ఐటీ అభివృద్ధి చంద్రబాబు ఘనత కాదా? సమర్థుడైన పరిపాలకుడిగా కీర్తి సాధించింది చంద్రబాబు కాదా? ?అని అనుకుంటున్నారా! అవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు చేశారనే నిజాన్ని 100కు వందశాతం మేం కూడా అంగీకరిస్తున్నాం. కానీ నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ఏం చేస్తున్నారనే దాని గురించే ఈ సంవాదం అంతా.

దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాపులర్‌ ఎలా అయ్యారు?  సామాన్యుడి చెంతకు ఆర్థిక సేవలు అందించేందుకు బ్యాంకులను జాతీయం చేయడం?, ఆమ్‌ ఆద్మీల కోసం గరీబీ హఠావో నినాదం తేవడం, పొరుగున ఉన్న దేశాలను తన ధైర్యంతో గమ్మున ఉండేలా చేయగలడం వల్ల. ఆమె తనయుడు రాజీవ్‌గాంధీ ఏం చేశారు?  సాధారణ పౌరులకు అప్పుడు అందని ద్రాక్షగా ఉన్న టెలికాం సేవలను చేరువచేయగలిగారు. యువతను పరిపాలనలో భాగస్వామ్యం చేశారు. సర్వామోదం పొందిన బీజేపీ ప్రధాని వాజ్‌పేయి ఏం చేశారు?  మౌళిక సదుపాయాలకు పెద్దపీటవేసి ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద మారుమూల గ్రామాలకు రోడ్లు వేశారు.

అంతెందుకు అన్నగారు అని నందమూరి తారకరామారావు ఏం చేశారు?! బడుగు బలహీనవర్గాల కోసం రెండు రూపాయలకు కిలో బియ్యం ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రజానికాన్ని పీల్చిపిప్పిచేస్తున్న పటేల్‌-పట్వారీ వ్యవస్థకు చెక్‌ పెట్టారు.

దాంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వచ్చిన  వైఎస్‌ఆర్‌ సంగతేంటి? ఆస్పత్రికి వెళ్లాలంటే భయపడాల్సిన స్థితిలో ఉన్న వారికోసం ఆరోగ్యశ్రీని, 108 అంబులెన్స్‌ను తెచ్చారు. చదువుకునే వారికోసం ఫీజురీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టి మార్కులు కొట్టేశారు. పైన చెప్పిన పాలకులంతా అవి తప్ప ఇంకేం చేయలేదా...అంటే చేశారు. కానీ పై అంశాలపై ఎక్కువ ఫోకస్‌ చేశారు. తద్వారా వారి ప్రస్తావన వస్తే ఈ అంశాలే గుర్తుకు వచ్చేలా చేశారు.

చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అచ్చం పై అందరిలాగే ఉన్నాడు. ఐటీ-మౌలిక సదుపాయాలపై బాగా దృష్టిపెట్టారు. ప్రపంచమంతా తిరిగారు. ఐటీ భవిష్యత్‌ ఊహించి హైటెక్‌ సిటీని తీర్చిదిద్దారు. ?ఐటీపై, ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ పై ఆయన పెట్టిన శ్రద్ధే ఆయనను హైటెక్‌ చంద్రబాబుగా, దార్శకుడిగా పేరు తెచ్చిపెట్టింది. అదే నవ్యాంధ్ర సీఎంగా మేధావులు మద్దతు పలికేలా చేసింది.

మరి ఇప్పటి చంద్రబాబు సంగతేంటి??

''ప్రజలు కొత్త రాష్ట్రాన్ని నేనయితే అభివృద్ధి చేస్తాను అని నమ్మి నా చేతిలో పెట్టారు కాబట్టి ఈ ఐదేళ్లు ఏపీని అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్ది సంపూర్ణ స్వర్ణాంధ్రను సాధిద్ధాం'' అనుకోవడంతోనే బాబుకు కష్టాలు మొదలయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే... అది అసాధ్యం. ఏ దేశం, ఏ రాష్ట్రంలోనూ అది సాధ్యం కాదు. బాబు ఇపుడు ప్రతిదాని మీద దృష్టి పెట్టి ఎందులోనూ ఫలితాలను సాధించలేకపోతున్నారు. ఏ వర్గాన్నీ సంతృప్తికి గురిచేయలేకపోతున్నారు.

నవ్యాంధ్ర సీఎంగా చంద్రబాబు తన ప్రాధామ్యాలను సరిగా ఎంచుకోలేకపోతున్నారనేది విశ్లేషకుల మాట. ఏడు గ్రిడ్‌లు, ఐదు మిషన్లు, నదుల అనుసంధానం, అమరావతి, ఐటీ, హార్డ్‌ వేర్‌, పోర్టులు, ఉత్తమ నగరాలు, ఫైబర్‌ గ్రిడ్‌... ఇలా ఒకటా రెండా... ఎన్నో అంశాలు నెత్తికెత్తుకున్న చంద్రబాబు ఏ ఒక్క అంశాన్ని ఫోకస్డ్‌గా తీసుకోలేదు. దీంతో ఏ పనీ జరగడం లేదు. ఉమ్మడి ఏపీ సీఎంలా ఇపుడు కూడా రెండు-మూడు విషయాలపై ఆయన దృష్టిపెడితేనే మరోసారి అధికారం అని విశ్లేషకులు అంటున్నారు.

ఇక బాబు ఇలా ఎందుకు మారాడంటే... ?

విభజన పరిణామాల నుంచి రాష్ట్రాన్ని ఒడ్డున పడేయడం ఎలా అనే గందరగోళమా?  లేక కేంద్రం చేస్తానన్న సహాయం విషయంలో పొంతన లేని సమాచారమా?  తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని నడిపించడం అనే బాధ్యతల భారం ఇందుకు కారణమా తెలియదు కానీ...చంద్రబాబు ఏ ఒక్క అంశంపై పూర్తి శ్రద్ధ పెట్టడంలేదు, పట్టు సాధించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. అన్నింటికి సమూలంగా మార్చేయాలనే ఆకాంక్ష మంచిదే అయినా..వాస్తవ పరిస్థితులకు అది సరిపోదనే విషయాన్ని బాబు గ్రహించాలని అంటున్నారు.

కొసమెరుపుః తెలంగాణ ముక్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్‌ కూడా ఇదేరీతిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల అక్రమాలు, అక్రం భవనాల కూల్చివేత, మూసి ప్రక్షాళన, అవినీతి రహిత పాలన, మిషన్‌ కాకతీయ, వాటర్‌ గ్రిడ్‌,? ప్రాజెక్టుల రీడిజైన్‌....ఇలా ఎన్నో అంశాలు ముందు పెట్టుకున్నారు. అయితే అన్నింటికీ పరిష్కారం చూపేందుకు తన చేతిలో అల్లాఉద్దీన్‌ అద్భుత దీపం లేదని తొందరగానే గ్రహించిన కేసీఆర్‌ తన ఆలోచనలను నిర్మోహమాటంగా పక్కనపెట్టగలిగారు. వాస్తవంలోకి వచ్చి వెనక్కు తగ్గి... ప్రాక్టికల్‌ గా సాధ్యమయ్యే వాటిపైనే ఇపుడు దృష్టిపెడుతున్నాడని అంటున్నారు. మరి చంద్రబాబు కూడా కొత్తగా ఏ మారక్కర్లేదు. గతంలో తాను ఉన్నట్లు ఉంటే... ఆయనకు తిరుగులేదు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు