ఛత్రపతి రీమేక్ ఆయన చేతికి?

ఎప్పుడో 2005లో వచ్చిన సినిమా ‘ఛత్రపతి’. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టయి ప్రభాస్ కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పిన ఈ చిత్రం తమిళం, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో విడుదలైన దశాబ్దంన్నర కాలానికి ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు బయటికొచ్చాయి. ఇలా పాత తెలుగు సినిమాలను హిందీలో లేటుగా రీమేక్ చేయడం మామూలే.

ఐతే ఈసారి ఈ చిత్రాన్ని అక్కడికి తీసుకెళ్తోంది ఓ తెలుగు హీరో అనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగులో ఇంకా హీరోగా అనుకున్న స్థాయిలో నిలదొక్కుకోని బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో నటించబోతున్నాడట. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని హిందీలో తీస్తాడని ముందు వార్తలొచ్చాయి. ఐతే అది నిజం కాదని సుజీతే స్వయంగా వెల్లడించాడు. మరి అతడి స్థానంలోకి ఎవరొస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆ బాధ్యత ఎవరైనా బాలీవుడ్ డైరెక్టర్‌కే అప్పగిస్తాడా అన్న చర్చ కూడా నడిచింది.

ఐతే మన మాస్ డైరెక్టర్ వి.వి.వినాయకే హిందీలో ‘ఛత్రపతి’ని రీమేక్ చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్‌ను ‘అల్లుడు శీను’తో తెలుగులో లాంచ్ చేసింది వినాయకే. అప్పటికేి చాలా పెద్ద రేంజిలో ఉన్నప్పటికీ బెల్లంకొండ సురేష్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆయన కొడుకును లాంచ్ చేయడానికి ముందుకొచ్చాడు. ఐతే ఇప్పుడు వినాయక్ అంతగా ఫామ్‌లో లేని సంగతి తెలిసిందే.

ఆశ్చర్యకరంగా ‘ఛత్రపతి’ రీమేక్ కోసం ముందు దర్శకుడిగా ప్రచారం జరిగిన సుజీత్, ఇప్పుడు తెరపైకి వచ్చిన వినాయక్ ఇద్దరూ కూడా .. మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న ‘లూసిఫర్’ రీమేక్‌కు దర్శకులుగా ప్రచారంలో ఉన్న వాళ్లే. కానీ ఆ ఇద్దరూ ఒకరి తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ‘ఛత్రపతి’ రీమేక్‌కు ముందు సుజీత్ పేరు వినిపించడం.. ఇప్పుడేమో వినాయక్ పేరు తెరపైకి రావడం ఆశ్చర్యకరం. ఇలా ఇద్దరు పొంతన లేని దర్శకుల పేర్లు వరుసగా రెండు ప్రాజెక్టులకు ఒకదాని తర్వాత ఇంకోటి వార్తల్లో నిలవడం విశేషమే.