జగన్‌ లో పస లేదా?

జగన్‌ లో పస లేదా?

తప్పుడు నిర్ణయాలతో వరుసగా దెబ్బతింటున్న వైసీపీ అధినేత జగన్‌ మరో తప్పటడుగు వేశారు. ఇప్పటికే శాసనసభ నుంచి రోజా ఏడాదిపాటు బహిష్కారానికి గురవగా... దానిపై న్యాయపోరాటానికి అవకాశాలున్నప్పటికీ ఆ జోలికి పోకుండా శాసనసభలోనే రాద్ధాంతం చేస్తున్న ఆయన తాజాగా స్పీకరుపై అవిశ్వాసం పెట్టడానికి నిర్ణయించారు. ఆయన తాజా నిర్ణయాన్ని అనాలోచిత చర్యగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అవిశ్వాసం ప్రకటించడాన్ని దేశంలో ఏ పార్టీలు, ఏ సభలు సీరియస్‌ గా తీసుకోవడం మానేసి చాలాకాలమైపోయింది... రాజకీయ విలువలు క్షీణించిన తరువాత ఇలాంటి చర్యల వల్ల ఇప్పుడు ఫలితమే ఉండడం లేదు. కాబట్టి అలాంటి రొటీన్‌ ఎత్తుగడ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని భావిస్తున్నారు.

అసలు ప్రభుత్వమే విపక్షం మొత్తాన్నీ సస్పెండ్‌ చేసేందుకు కూడా వెనుకాడని తరుణంలో సభ నుంచి వాకౌట్‌ చేయడం కూడా అనవసరమని అంటున్నారు. సభలోనే ఉంటూ... గట్టి ఉదాహరణలు, ఆధారాలతో చర్చలో పాల్గొన్ని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సింది పోయి.. పాతకాలపు ఎత్తుగడల వల్ల ప్రయోజనం లేదని అంటున్నారు. యువకుడైన జగన్‌ తన దూకుడును కేవలం మాటల్లో కాకుండా చేతల్లోనూ చూపించగలగాలని అంటున్నారు.

ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటూ తలపడాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు సభలో ఉండి, చర్చలో పాల్గొనడానికి మించిన అవకాశం వేరే ఉండదు. కానీ, జగన్‌.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం నిరాధార ఆరోపణలు, నోటికొచ్చిన మాటలతో ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలనుకుంటున్నారు. ఆ కారణంగానే జగన్‌ వరుసగా విఫలమవుతున్నారు.

ఇది ఇలాగే కొనసాగితే వచ్చే మూడేళ్లలో శాసనసభలో జగన్‌ వైఫల్యాలు ప్రజలకు పూర్తిగా అర్థమైపోయి ఆయనపై విశ్వాసం పోయే ప్రమాదమూ ఉంది.  యువ నేతలో పసలేదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడడం ఖాయం. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు జగన్‌ సొంతవో... సలహదారులు చెప్తున్నవో కానీ... జగన్‌ జన నేత కావడానికి ఇవి ఎంత మాత్రం ఉపయోగపడవు. మాట్లాడకుండా వెళ్లిపోవడం కంటే మాట్లాడి గెలిస్తేనే గుర్తింపు దక్కుతుందని జగన్‌ ఇప్పటికైనా గుర్తించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English