ఓవైసీ ఎత్తుతో ఆ పార్టీకి చుక్కలే

ఓవైసీ ఎత్తుతో ఆ పార్టీకి చుక్కలే

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడం, ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలు లిట్మస్‌ టెస్ట్‌గా పరిణమించిన తరుణంలో ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. హైదరాబాద్‌ అంటే తమ ఇలాకా అని భావించే ఓవైసీలు ఈ దఫా గ్రేటర్‌లో ఎంఐఎం సత్తా చాటేలా చేయాలని క్రియాశీలంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

బల్దియా ఎన్నికలు సమీపిస్తుండటంతో మజ్లిస్‌ పార్టీ చాప కింద నీరులా తన ప్రచారాన్ని ప్రారంభించింది. గెలుపే లక్ష్యంగా ముందుకువెళ్లేందుకు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అససుద్దీన్‌ ఓవైసీ మునుపెన్నడు లేని విధంగా రంగంలోకి దిగాడు. తమ పార్టీలోని ద్వితీయశ్రేణి నేతల్ని పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని రహస్య మంతనాలు జరుపుతున్నాడు. ఎవరెవరు పోటీలో ఉంటే బాగుంటుందని సమాచారం తెలుసుకుంటున్నాడు. ఇటీవల ఓవైసీ దారుసలాంలో అసహనం, బీఫ్‌ ఫెస్టివల్‌ పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించాడు. ఈ సందర్భంగా బల్దియా ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, సంఘ్‌ పరివార్‌కు గట్టిషాక్‌ ఇవ్వాలంటే వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్థుల్ని అత్యధిక సంఖ్యలో గెలిపించాలని పిలుపునిచ్చారు. మతసభల్లోనూ ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తుండటం గమనారం.

అత్యధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఓవైసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. తమ పార్టీకి ఓటు బ్యాంకు ఉన్న డివిజన్లలో పాదయాత్రలు చేయాలని, సంబంధిత శాఖలపై ఒత్తిడి తెచ్చి రోడ్లు, మంచినీరు, వీధిలైట్లు వంటి వెంటనే ఏర్పాటు చేసేవిధంగా చూడాలని ఎంఐఎం ఎమ్మెల్యేలకు సూచించారు. ఓటర్‌ లిస్టుల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని ద్వితీయశ్రేణి నేతలకు బాధ్యతలు కూడా ఓవైసీ అప్పగించాడు. ఇంతే కాకుండా...ఓటర్‌ లిస్టులో పేర్లు నమోదుకు కూడా కమిటీలు వేయడం వేశాడంటేనే, గ్రేటర్‌ ఎన్నికలను ఎంఐఎం ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమవుతోంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో లోపాయకారి పొత్తు పెట్టుకున్న మజ్లిస్‌ పార్టీ నూటా యాభై డివిజన్లకు గానూ 45 డివిజన్లలో విజయం సాధించింది. రెండేండ్ల పాటు డిప్యూటీ మేయర్‌గానూ, మూడేళ్ల పాటు మేయర్‌గా  ఆ పార్టీ నాయకులు పనిచేశారు. అయితే ఈ సారి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు పెట్టుకునేలా పరిస్థితులు కనిపించడంలేదుకానీ లోపాయకారి అవగాహనతో 50 నుంచి 70 డివిజన్లలో పోటీ చేయాలని చూస్తోంది.

ఈ క్రమంలోనే త్వరలో బస్తీల్లో బహిరంగ సభలు పెట్టడానికి ఎంఐఎం ఏర్పాట్లు చేస్తోంది. ఈలోగా మిలాద్‌-ఉన్‌-నబీని పురస్కరించుకుని నిర్వహించే సభల్లోనూ ఎన్నికల ప్రచారం చేయాలని నేతలకు ఓవైసీ సూచించినట్టు తెలిసింది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేనాటికి టార్గెట్‌ పెట్టుకున్న వార్డులపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

?ఇంకో విషయం ఏంటంటే... ఈ ఎంఐఎం పార్టీ నాయకులు తమ ప్రజలకు అందుబాటులో ఉన్నట్టుగా రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండదు. ఎంత సామాన్యుడైనా మజ్లిస్‌ ఎమ్మెల్యేను కలిసే అవకాశం నిత్యం ఉంటుంది. అంటే వాళ్లు మతాన్ని ఎంత బాగా నమ్ముతారో అవసరాన్ని కూడా అంతే బాగా నమ్ముతారు.?

కొసమెరుపు: ఎంఐఎం నేతలు ఓ పాన్‌ షాపు, సైకిల్‌ షాపు, ఇరానీ హోటల్‌, మటన్‌ షాపు ఓపెనింగ్‌ కు పిలిచినా వస్తారు... కానీ తన ప్రాంతంలో జనం తెలివిమీరి పోవడానికి ఉపయోగపడే దుకాణం, ఆఫీసుల ప్రారంభానికి పిలిస్తే అసలు రారు. ?మహిళలను చైతన్య పరిచే కోవా అనే సంస్థను ఆ ప్రాంతంలో స్థాపించినపుడు మజ్లిస్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు