నితీష్‌ పార్టీ ఏపీ హెడ్‌గా కిరణ్‌కుమార్‌ రెడ్డి

నితీష్‌ పార్టీ ఏపీ హెడ్‌గా కిరణ్‌కుమార్‌ రెడ్డి

మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఎన్నికైనప్పటి నుంచి దిగే వరకు ప్రతీ సంఘటన ఓ సంచలనమే. రాజశేఖర్‌ రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత రోశయ్య సీఎం కావడం....ఆ తర్వాత ఢిల్లీ లాబీయింగ్‌తో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అవ్వడం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌తో విబేధించిన బయటకు వచ్చారు. తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో పోటీ చేసినా ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయారు. ఎన్నికల తర్వాత కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజేపీలోకి వెళతారని ఎప్పటి నుంచో ఊహాగానాలు వచ్చినా కిరణ్‌మాత్రం సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు.

కిరణ్‌ను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కొందరు బీజేపీ పెద్దలు మంతనాలు జరిపినా కిరణ్‌ నుంచి ఎలాంటి రిప్లై రాలేదని తెలుస్తోంది.  2019 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో... ఇప్పుడే ఏ పార్టీలో చేరాలనే అంశంపై నిర?యం తీసుకోకుండా సరైన టైం కోసం కిరణ్‌కుమార్‌ రెడ్డి వెయిట్‌ చేస్తున్నారట. అయితే ఇప్పటి వరకు పూర్తి మౌనంగా ఉన్న కిరణ్‌కు ఓ కొత్త పార్టీలో చేరాలని ఆహ్వానం అందుతున్నట్టు వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

బీహార్‌లో బీజేపీని చిత్తు చిత్తు చేసిన నితీష్‌కుమార్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. తన పార్టీ విస్తరణలో భాగంగా జేడీయూ ఏపీ విభాగం కన్వీనర్‌ బాధ్యతలను మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. నితీష్‌కుమార్‌ 2019 ఎన్నికల్లో ఢిల్లీ పీఠంపై గురి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఉత్తరాదిలో బీహార్‌, యూపీ, బెంగాల్‌లాంటి రాష్ట్రాలతో పాటు తన సామాజికవర్గం బలంగా ఉన్న ఏపీ, తెలంగాణ, కరా?టకపై కూడా నితీష్‌ గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ జేడీయూ శాఖ బాధ్యతలను కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించేందుకు నితీష్‌ స్కెచ్‌ వేస్తున్నారట. సంక్రాంతి రోజున నితిష్‌ చేయబోయే దహీ చోడా పార్టీకి హాజరు కావాల్సిందిగా కిరణ్‌ కుమార్‌ కు ఆహ్వానం అందిందని... రాజకీయాల్లో క్రీయాశీలకంగా లేని కిరణ్‌ ను ఆహ్వానించడం వెనుక నితీష్‌ వ్యూహాం ఇదేనని పొలిటికల్‌ సర్కిల్స్‌ లో టాక్‌ మొదలైంది. ఎన్నికలకు ముందు జై సమైక్యాంధ్ర పార్టీతో ఘోరంగా విఫలమైన కిరణ్‌ సౌత్‌లో అంతగా ప్రభావం లేని జేడీయూ బాధ్యతలు స్వీకరించే సాహసం చేస్తారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది.