గ్రేటర్‌ సర్వే ఫలితాలు వచ్చేశాయోచ్‌

గ్రేటర్‌ సర్వే ఫలితాలు వచ్చేశాయోచ్‌

ఇప్పుడు అందరి చూపులు గ్రేటర్‌ ఎన్నికల మీదే ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బల్దియా ఎన్నికల్ని సీరియస్‌ గా తీసుకోవటం.. ఇందుకోసం.. దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ పెట్టి పుష్కరం దాటినా.. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసుకున్న ఆయనకు మరో తీరని కోరిక మిగిలిపోయింది. గ్రేటర్‌ మీద గులాబీ జెండా ఎగరాలని.. అది కూడా ఒంటరిగా.. ఎవరి సాయం లేకుండా అని.

చాలా కష్టసాధ్యమైన ఈ వ్యవహారాన్ని సాధిస్తే.. తమకు తిరుగు ఉండదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే.. గ్రేటర్‌ ఎన్నికలపై పక్కా వ్యూహం సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. తాను ఏదినా అనుకుంటే దాన్ని సాధించేంతవరకూ నిద్రపోని మొండితనం  కేసీఆర్‌ సొంతం. అలాంటి ఆయన.. గ్రేటర్‌ మీద మనసు పడటం.. వాతావరణం తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో గ్రేటర్‌ పీఠాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.

ఇందుకోసం ఇప్పటికే భారీ ప్రచారాన్ని షురూ చేసిన తెలంగాణ అధికారపక్షం.. గ్రేటర్‌ ఎన్నికల వాతావరణాన్ని నోటిఫికేషన్‌ ముందే తీసుకొచ్చేసింది. గ్రేటర్‌ పరిధిలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న తెలంగాణ అధికారపక్ష నేతలు.. నగరవాసుల మీద వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇక.. ఫ్లెక్సీలతో ఎంత సందడి చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి సర్వే నిర్వహించారంటూ సోషల్‌ మీడియాలో ఒక రిపోర్ట్‌ చక్కర్లు కొడుతోంది. ఆసక్తికరంగా ఉన్న ఈ అంచనాలు చూస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాను అనుకున్నది సాధించటం ఖాయమన్న అభిప్రాయం కలుగుతుంది.

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంచనాలేమంటే..

టీఆర్‌ఎస్‌   75 - 80

మజ్లిస్‌      40 - 45

కాంగ్రెస్‌      10 - 15

టీడీపీ       08 - 12

బీజేపీ       05 - 10

ఇతరులు   03 - 08

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు