అమెరికన్‌ పాలిటిక్స్‌ లోకి ఫేస్‌ బుక్‌ అధినేత?

అమెరికన్‌ పాలిటిక్స్‌ లోకి ఫేస్‌ బుక్‌ అధినేత?

నూనుగు మీసాల వయసులో ప్రపంచప్రఖ్యాతి సాధించిన ఫేస్‌ బుక్‌ అధినేత జుకర్‌ బర్గ్‌ భవిష్యత్‌ లో మరిన్ని సంచలన అద్భుతాలు సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. మహామహా వ్యాపార యోధులను మించిపోయేలా ఫేస్‌ బుక్‌ ను ప్రపంచంలోని ప్రతి మూలకూ చేర్చిన ఆయన అత్యంత సంసన్నుడిగా, ప్రజాదరణపొందిన వ్యక్తిగానూ మారాడు.

ఇంతవరకు తన వ్యాపారమేదో తాను చేసుకుంటూ.... పలు దేశాల్లో సాంకేతిక అంశాలు, సామాజిక అంశాల్లో సహాయపడుతున్న జుకర్‌ బర్గ్‌ తాజాగా చేసిన కామెంట్లు భవిష్యత్తులో ఆయన అమెరికా రాజకీయాల్లోకి వస్తారా అన్న చర్చకు తెరతీశాయి. ఇంతవరకు ఎన్నడూ వివాదాస్పద అంశాలు, రాజకీయాలతో ముడిపడిన విషయాల జోలికి వెళ్లని ఆయన తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఫేస్‌ బుక్‌ లో పోస్టింగులు పెట్టారు.

అమెరికాలోకి రాకుండా ముస్లింలను బ్యాన్‌ చేయాలని రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను జుకర్‌ బర్గ్‌ ఖండించారు. ఎవరో పాల్పడిన చర్యలకు ముస్లింలు అందరు బాధపడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పారిస్‌ దాడులు, ఇతర ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ముస్లింలపై వివక్ష చూపించడం సరికాదని తేల్చి చెప్పారు.

జుకర్‌ బర్గ్‌ తన ఫేస్‌ బుక్‌ పేజీలో 'ఒక జ్యూ మతస్తుడిగా నీ పైనే కాకుండా ఏ మతంపై దాడి జరిగినా ఎదురు నిలవాలని నా తల్లిదండ్రులు చెప్పారు' అని వెల్లడించాడు. అలాగే ఫేస్‌ బుక్‌ అధినేతగా ముస్లింలు వారి హక్కుల కోసం, శాంతియుతమైన, వివక్ష రహిత వాతావరణం కోసం చేసే పోరాటానికి తాను మద్దతిస్తానని ప్రకటించారు. ఆయన చెప్పింది మంచి మాటే అయినా రాజకీయ ఉద్దేశాలూ ఇందులో ఉన్నాయన్న చర్చ మొదలైంది. చూడాలి... మార్పు నినాదంతో ఒబామా అమెరికా అధ్యక్షుడైనట్లుగానే శాంతి, సాంకేతితక, వివక్ష వంటి అంశాలనుఎత్తుకుని జుకర్‌ బర్గ్‌ కూడా ఎప్పుడైనా అమెరికా అధ్యక్షుడవుతారేమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు