ఎంఐఎం అధినేతకు శివసేన మద్దతు

ఎంఐఎం అధినేతకు శివసేన మద్దతు

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీని ఆయన సైద్ధాంతిక శత్రువు శివసేన ఆకాశానికెత్తేసింది. ఇంతవరకూ తటస్థ పార్టీలు కూడా చేయని పనిని శివసేన చేసింది. అసదుద్దీన్‌ విషయంలో ఆ పార్టీ చెప్పిన విన్న అభిప్రాయం విన్నవారికెవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. కరడుగట్టిన హిందూత్వ పార్టీగా ముద్రపడిన శివసేన, కరడుగట్టిన ముస్లి పార్టీగా ముద్రపడిన ఎంఐఎం అధినేతను ప్రశంసించడం దేశ రాజకీయాల్లో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందులోనూ ఎంఐఎం హైదరాబాద్‌ ను దాటి దేశమంతటా విస్తరించాలనే క్రమంలో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తూ మహారాష్ట్రలో రెండు అసెంబ్లీ సీట్లను కూడా గెలుచుకున్న తరుణంలోనూ శివసేన రాజకీయాలతో సంబంధం లేకుండా ఎంఐఎం అధినేతను కీర్తించడం సాధారణ విషయం కాదు. సమాజ్‌ వాది పార్టీ నేత ఆజంఖాన్‌ పై శివసేన మండిపడుతూ ఆయన అసదుద్దీన్‌ నుంచి పాఠాలు నేర్చుకోవాలని... అసదుద్దీన్‌ ఏనాడూ దేశ ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడిన సందర్భమే లేదని శివసేన పేర్కొంది. బహుశా శివసేన చేసిన ఈ వ్యాఖ్యకు అసద్‌ కూడా ఆశ్చర్యపోయుంటాడేమో.

శివసేన మంగళవారం ఎస్పీ నేత ఆజంఖాన్‌ పై విరుచుకుపడింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కంటే ఎస్పీనేత అజాంఖాన్‌ ప్రమాదకారి అని శివసేన ఆరోపించింది. పారిస్‌, బాబ్రిపై అజాంఖాన్‌ చేసిన ప్రకటనల నేపథ్యంలో శివసేన ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అదే సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ప్రస్తావన తీసుకొచ్చింది. అసదుద్దీన్‌ లాంటి నేత కూడా ఏనాడూ దేశ ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడలేదని... ఆయన్ను చూసి ఆజం ఖాన్‌ ఎంతో నేర్చుకోవాలని పేర్కొంది. అయితే... శివసేన మాటల వెనుక రాజకీయ కోణముందన్న వాదనా వినిపిస్తోంది. హైదరాబాద్‌ లో శివసేనను విస్తరించేందుకు గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతున్న నేపథ్యంలో కొంత సానుకూల వాతావరణం సృష్టించుకునే ప్రయత్నంలో భాగంగా శివసేన ఇలా వ్యవహరించి ఉండొచ్చని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు