అద్వానీకి అడ్డొస్తున్న శరద్‌ పవార్‌

అద్వానీకి అడ్డొస్తున్న శరద్‌ పవార్‌

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం పూర్తి కానున్న తరుణంలో దేశ రాజకీయాల్లో చాలా మార్పులొస్తున్నాయి. ఆ పదవిపై కన్నేసిన ఆశావహులు కొందరు అప్పుడే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే... కొందరి విషయంలో అది ఆశ కంటే అత్యాశే అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ప్రణబ్‌ పదవీకాలం 2017తో పూర్తవుతుంది.  ఈ దశలో ఆ పదవిని కోరుకునే వారు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీ లెక్కల ప్రకారం ఆ పదవిని ఆ పార్టీ కురువృద్ధుడు అద్వానీకి ఇవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కానీ... కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా ఆ పదవిపై కన్నేయడంతో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయన్నది చూడాలి.

డిసెంబరు 12న పవార్‌ జన్మదిన వేడుకలను భారీగా నిర్వహించేందుకు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాష్ట్రలో కానీ, కేంద్రంలో కానీ పవార్‌ అధికారంలో లేరు.. అయినా ఢిల్లీలో ఆయన తన జన్మదిన వేడుకల్ని జరపడం వెనుక పెద్ద ప్లానే ఉందని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా సహా రాజకీయ ప్రముఖులందరినీ ఆయన ఆహ్వానించడంతో పవర్‌ కొత్త ప్లానేదో త్వరలో బయటపెడతారని అంటున్నారు. అయితే... ఆయన ప్రస్తుతం చెప్పకపోయినా ఆయన రాష్ట్ర పదవిపై ఆయన కన్నేశారని అంటున్నారు.  అది సాధించడం కోసం ఆయన ఎన్డీయేలో చేరే ప్రయత్నాలు సాగిస్తున్నారని వినికిడి.

కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ, పవార్‌ ల మధ్య మంచి స్నేహం ఉండడంతో జైట్లీ సహకారంతో ఎన్డీయేలో చేరాలన్నది పవార్‌ ప్లాన్‌. కానీ, అది అంత సులభం కాకపోవచ్చు.  మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో  బీజేపీ, శివసేనల మధ్య బేరసారాలు సాగుతుండగా మద్దతిచ్చేందుకు ఎన్సీపీ ముందుకొచ్చినా బీజేపీ ఓకే చెప్పలేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఎన్సీపీ పట్ల మోడీ ఆసక్తి చూపించకపోవచ్చంటున్నారు.

అయితే.. ఎలాగైనా బీజేపీకి చేరువై 2017లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉండాలని పవార్‌ గట్టిగా కోరుకుంటున్నారట.  ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి... ఆయన అద్వానీకి అడ్డంపడతారా..? లేదంటే అద్వానీ అవకాశాలకు గండికొట్టేందుకు పవార్‌ ను ఎంటర్టైన్‌ చేస్తారా అన్నది కొద్ది రోజులు ఆగితే కానీ అంచనా వేయలేం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు