ఆ ముగ్గురి నోటికి తాళం వేసిన చంద్రబాబు

ఆ ముగ్గురి నోటికి తాళం వేసిన చంద్రబాబు

ఏపీలో బీజేపీ, టీడీపీ పేరుకు మిత్రపక్షాలే అయినా కొందరు బీజేపీ నేతలు టీడీపీపై అపుడపుడు ఒంటికాలిపై లేస్తున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా పెట్టుకుని పదే పదే విమర్శలు చేస్తున్నారు. వీరిలో ఎప్పటి నుంచో బీజేపీలో ఉంటున్న సోము వీర్రాజు టాప్‌ ప్లేసులో ఉంటే మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కూడా తనదారిలో తాను వెళుతూ ప్రభుత్వానికి, చంద్రబాబుకు కొన్ని సార్లు చికాకు తెప్పిస్తున్నారు. వీళ్ల సంగతి ఇలా ఉంటే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలు కూడా కావాలనే టీడీపీ/చంద్రబాబును విమర్శిస్తున్నారన్న భావన టీడీపీ నేతల్లో ఉంది.

కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ, దగ్గుబాటి పురందేశ్వరి ఈ ముగ్గరు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వలస వచ్చిన వారే. వీరిలో పురందేశ్వరి, కావూరి కేంద్ర మంత్రులుగా పనిచేస్తే... కన్నా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. టీడీపీ వ్యతిరేకులుగా ముద్రపడిన వీరు చిన్న ఛాన్స్‌ దొరికినా చంద్రబాబును విమర్శిస్తూ వస్తున్నారు. రాజధాని భూసేకరణ విషయంలో కూడా వీరు ఆ ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో అసలు టీడీపీకి బీజేపీ మిత్రపక్షమా... ప్రతిపక్షమా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. సోము వీర్రాజు అయితే టీడీపీని ప్రతిపక్షంగా భావిస్తూ విమర్శలు చేస్తున్నారన్న చర్చలు జరుగుతున్నాయి.

 అయితే టీడీపీపై ఏపీ బీజేపీ నేతల విమర్శల వల్ల ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళుతున్నాయని భావించిన చంద్రబాబు ఈ విషయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కావూరి, కన్నా, పురందేశ్వరి ఇప్పుడు పూర్తిగా సైలెంట్‌ అయినట్టు తెలుస్తోంది. ఇక మొదట్లో వీర్రాజు వ్యాఖ్యలను పట్టించుకోవద్దని టీడీపీ నేతలకు సూచించిన చంద్రబాబు%లల% తరువాత మాత్రం అతడి కామెంట్స్‌ కు అదే రేంజ్‌ లో కౌంటర్‌ ఇవ్వాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. శనివారం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ బీజేపీ సమన్వయ కమిటీ సమావేశానికి కూడా వీర్రాజు డుమ్మా కొట్టారు. వీర్రాజుపై ఓ కన్నేసి ఉంచడంతో పాటు మనోడికి గట్టి కౌంటర్లు ఇవ్వండని చంద్రబాబు టీడీపీ నేతలకు సీరియస్‌గా చెప్పినట్టు తెలుస్తోంది. వీర్రాజుకు కూడా పైనుంచి వార్నింగ్‌ వచ్చే ఉంటుందని అందుకే ఇటీవల కాస్త సైలెంట్‌ అయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఏపీలో టీడీపీపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలకు చంద్రబాబు తనదైన శైలీలో చెక్‌ పెట్టారన్న స్పష్టమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు