సీమాంధ్రుల ఓట్లకు కేసీఆర్‌ కొత్త స్కెచ్‌

సీమాంధ్రుల ఓట్లకు కేసీఆర్‌ కొత్త స్కెచ్‌

కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అలియాస్‌ కేసీఆర్‌ అనే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత తెలంగాణ ఉద్యమం సమయంలో సీమాంధ్రులను ఎన్నిరకాలుగా, ఎన్నిమాటలు, బూతులతో బురదజల్లారో మనందరికీ బాగా తెలిసిందే. అయితే సీఎం అయిన తర్వాత సీన్‌ మారింది. సీమాంధ్రుల కాలికి ముల్లుగుచ్చుకున్నా తన పంటితో తీస్తానని కేసీఆర్‌ స్వయంగా ప్రకటించాడు. అన్నట్లుగానే ఈ మధ్యకాలంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో పెద్దగా ఇబ్బందికరమైన సంఘటనలేమీ జరగలేదు. ఇదంతా కేసీఆర్‌ వ్యూహంలో భాగమనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీమాంధ్రులపై మరో కుట్రకు కేసీఆర్‌ తెరలేపారు.

త్వరలో జరుగనున్న ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పట్టుదలగా ఉన్నారు. ఇందుకు తగ్గట్లే తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని సీమాంధ్రులను గుర్తించటమనే పనిలో ఇపుడు టీఆర్‌ఎస్‌ యంత్రాంగం బిజీబిజీగా ఉంది. జీహెచ్‌ఎంసీ మొత్తం ఓట్లలో సీమాంధ్రుల ఓట్లెన్ని, అందులో కూడా ఏ డివిజన్లో ఎన్ని ఓట్లున్నాయి, సామాజిక వర్గం వారీగా కూడా ఓట్ల వివరాలను ముఖ్యమంత్రి సేకరిస్తున్నారు. దీని ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీమాంధ్రుల తరపున గట్టి వారనుకున్న వారిలో కొందరిని టీఆర్‌ఎస్‌ తరపున పోటీకి దింపాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీమాంధ్రుల ఓటర్ల వివరాలు, గట్టి వారిని గుర్తించటం, వారిలో పోటి చేసే ఆసక్తి వున్నవారితో మాట్లాడటం లాంటి బాధ్యతలను కుమారుడు కె. తారకరామారావుతో పాటు సీనియర్‌ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు అప్పగించారు.

ఇప్పటికే వీరిద్దరు నగర శివారు ప్రాంతాల్లో వివిధ సామాజిక వర్గాలతో మూడు సార్లు సమావేశాలు కూడా నిర్వహించారు. ఎన్నికల్లో సీమాంధ్రులకు టీఆర్‌ఎస్‌ తరపున పోటీకి దింపటమంటే తమకు తెలంగాణా, సీమాంధ్ర బేధాలు లేవని చెప్పటమే అన్నది అసలు వ్యూహం. పోటీకి నిలబెట్టే వాళ్ళలో ఎందరు గెలిచారన్నది ముఖ్యం కాదని ఆ పేరుతో తమకు పడే ఓట్లే ముఖ్యమని కేసిఆర్‌ భావిస్తున్నారు. మొత్తంగా పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేయటం ద్వారా జీహెచ్‌ఎంసి పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు అందుబాటులో ఉండే ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోకూడదని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు