వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపతి పదవి?

వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపతి పదవి?

బీజేపీలో అంతర్గతంగా తీసుకున్న కీలక నిర్ణయం కారణంగా కేంద్రమంత్రి పదవికి దూరమవుతారని భావిస్తున్న వెంకయ్యనాయుడుకు అంతకుమించిన పదవి ఇస్తారన్న ఊహాగానాలు బీజేపీ ఉత్తరాది నాయకుల నుంచి వినిపిస్తోంది.

బీజేపీలో మూడుసార్లకు మించి ఎవరికీ రాజ్యసభ పదవి ఇవ్వరాదని ఇటీవల పార్టీ పరంగా నిర్ణయించుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆ లెక్కన 2016 జూన్‌ తో వెంకయ్య మూడో టెర్ము రాజ్యసభ పదవి ముగుస్తుంది. అక్కడి మరో ఆరు నెలల గ్రేస్‌ పీరియడ్‌ వరకు ఆయన కొనసాగినా కూడా 2016 డిసెంబరు వరకు మాత్రమే వెంకయ్య కేంద్ర మంత్రిగా ఉండగలరు. ఆ తరువాత కొనసాగాలంటే 2016 డిసెంబరు లోగా పార్లమెంటు సభ్యుడిగా ఎంపికవ్వాలి. అంటే రాజ్యసభ పదవి ఆయనకు నాలుగోసారి ఇవ్వాలి లేదంటే లోక్‌ సభకు ఎక్కడి నుంచైనా ఎన్నికవ్వాలి.

బీజేపీ కొత్త నిబంధన ప్రకారం నాలుగో సారి వెంకయ్యకు రాజ్యసభ పదవి ఇవ్వడం కష్టం. అలా అని ఆయనకు లోక్‌ సభ స్థానం కూడా ఎక్కడా కనిపించడం లేదు.. ఒకవేళ ఎవరైనా ఖాళీ చేసి ఇచ్చినా కూడా ప్రత్యక్ష పోటీకి వెంకయ్య సిద్ధమవుతారో లేదో తెలియదు. ఈ కారణాలన్నిటి వల్ల ఆయన్ను కేంద్ర మంత్రి పదవి కాకుండా వేరే పదవికి పంపిస్తారన్న కొత్త ప్రచారమొకటి వస్తోంది.

వెంకయ్యకు కేంద్ర మంత్రిగా అవకాశం పోతే గవర్నరు పదవి ఇస్తారని చాలామంది అనుకుంటున్నారు. అయితే... అంతకంటే పెద్ద ఊహాగానం కూడా ఒకటి వినిపిస్తోంది. ఆయన్ను ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అద్వానీకి రాష్ట్రపతి పదవి, వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని భావిస్తున్నారు. అద్వానీని తొక్కేశారన్న ముద్రను పోగొట్టుకోవడానికి మోదీ ఆయన్ను రాష్ట్రపతిని చేస్తారని భావిస్తున్నారు.  అదేవిధంగా తనకు నమ్మిన బంటయిన వెంకయ్యకు పునరావాసం కల్పించేందుకు మోదీ ప్రయత్నిస్తారని సమాచారం.

ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ పదవీకాలం 2017 ఆగస్టులో ముగుస్తుంది... అంటే వెంకయ్య పదవి 2016 డిసెంబరులో ముగుస్తుందనుకుంటే అక్కడికి 6 నెలల గ్యాప్‌ ఉంటుందన్నమాట. కాబట్టి వెంకయ్యను ఉపరాష్ట్ర పదవి వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీ బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు