బాబు మనసు మారింది

బాబు మనసు మారింది

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనసు మారిందా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టి సారించారా? అందులో భాగంగా ఇక నుంచి వారంలో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారా? అంటే అవుననే సమాధానం చెప్తున్నాయి తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు.

వరంగల్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరాలోచనలో పడ్డారని సమచారం. ఇదే క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇటువంటి పరాభవం ఎదురు కాకుండా జాగ్రత్త పడుతున్నారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. గత మూడు నాలుగు నెలల నుంచి విజయవాడకే పరిమితమైన బాబు హడావుడిగా గత శనివారం హైదరాబాద్‌లో కాలుమోపడం, అధికారులతో సుదీర్ఘ సమావేశాలు, గవర్నర్‌ని కలవడం చూస్తుంటే ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చినట్టు తెలుగుతమ్ముళ్లు చెపుతున్నారు. అంతే కాకుండా తెలంగాణలో జీహెచ్‌ఎంసి ఎన్నికల వరకైనా హైదరాబాద్‌లో ఉండాలని తెలంగాణ తెలుగుతమ్ముళు బాబుపై ఒత్తిడి తెచ్చారనే విషయం కూడా పార్టీ అధికారికంగా వెల్లడించిన నేపథ్యంలో చంద్రబాబు దృష్టి మారిందనే విషయాన్ని కాదనలేమని పార్టీ శ్రేణులు వివరిస్తున్నాయి.

విభజన చట్టంలో 10 సంవత్సరాల పాటు హైదరబాద్‌ ఉమ్మడి రాజధాని గా ఉండే వెసులుబాటు ఉంది. అందులో భాగంగానే బాబు తొలుత హైదరాబాద్‌ నుంచే పాలన సాగిస్తూ వచ్చారు. అయితే ఓటుకు నోటు కేసు అంశం ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచిన కొద్ది రోజులకే రాష్ట్రంలో ఉండే పాలన సాగిస్తామని గుట్టు చప్పుడు కాకుండా విజయవాడకు మకాం మార్చారు. అక్కడ నుంచే కేబినెట్‌ భేటీలు, సమీక్ష సమావేశాలు, విదేశీ ప్రతినిధులతో భేటీ ఇలా అన్ని కార్యక్రమాలను విజయవాడ నుంచే కానిస్తూ, గోదావరి పుష్కరాలు, అమరావతి శంకుస్థాపన వంటి కార్యక్రమాలు దగ్గర ఉండి జరిపించారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని సచివాలయానికి రావడమనేది దాదాపుగా మరిచిపోయారనే చెప్పాలి. అయితే వరంగల్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికలు, ఈ క్రమంలో టీడీపీ పనితీరును బాబును ఆలోచనలో పడేసినట్టు సమాచారం.

బాబు విజయవాడకే పరిమితమైతే తెలంగాణలో టీడీపీకి ఆదరణ కొరవడే పరిస్థితులు ఎదురుకావడం తప్పదనే భావనకు పార్టీ శ్రేణులు వచ్చినట్టు సమాచారం. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కీలకంగా మారాయి. నగరంలోని అధిక శాతం ఓటర్లలో సెటిలర్లు, ఉద్యోగులు ఉండడం అనేది టిడిపికి అను కూలిస్తున్న అంశాలని విశ్లేషకులు అంటున్నారు. దాంతో పాటు టీడీపీ-బీజేపీ కూటమి ఎమ్మెల్యే సీట్లు కూడా ఎక్కువుగా ఉండడం కూడా టీడీపీకి బలాన్ని ఇస్తున్నాయి. జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో కీలకమైన సెటిలర్లు, ఉద్యోగులను ఆకట్టు కోడానికి బాబు హైదరాబాద్‌కి మకాం మార్చనున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందు నుంచే హైదరాబాద్‌లో వారంలో రెండు రోజుల పాటు ఉండడానికి ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు