ఎంఎల్ఏలకు జగన్ క్లాసు పీకారా ?

ఇద్దరు ఎంఎల్ఏలకు జగన్మోహన్ రెడ్డి ఫుల్లుగా క్లాసు పీకారా ? అంటే అవుననే అంటున్నాయి తాడేపల్లి వర్గాలు. విశాఖపట్నం జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశంలో ఎంఎల్ఏలు, ఎంపి మధ్య వాగ్వాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. భూమి లావాదేవీల విషయంలో చోడవరం ఎంఎల్ఏ కరణం ధర్మశ్రీ-రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డికి పెద్ద వాగ్వాదమే జరిగింది. జిల్లాలోని అధికారులు, టీడీపీ ఎంఎల్ఏల మందు వీళ్ళద్దరి మధ్య పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది. అయితే ఇద్దరిలో ఎవరు కూడా మరొకరి పేరు ఎత్తకుండానే వాదులాడుకున్నారు.

రాజకీయ నేతలు భూములను ఆక్రమించుకుంటున్నారంటూ ఎంపి పదే పదే వ్యాఖలు చేశారు. దాంతో ధర్మశ్రీ మాట్లాడుతు రాజకీయనేతలు అంటూ అందరినీ ఒకే గాటన కట్టవద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా భూములు ఆక్రమించుకుని ఉంటే నేరుగా వాళ్ళ పేర్లు చెప్పాలంటూ ఎంఎల్ఏ డిమాండ్ చేశారు. ఒకరిద్దరిని ఉద్దేశించి మాట్లాడుతూ అందరినీ అవమానించేట్లుగా మాట్లాడటం తగదంటు ధర్మశ్రీ ఎంపిని తీవ్రంగా ఆక్షేపించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాం జరిగింది.

ఇదైపోయిన తర్వాత అనకాపల్లి ఎంఎల్ఏ గుడవాడ అమరనాధ్ కు ఎంపికి మధ్య ఇదే విషయమై మళ్ళీ వివాదం జరిగింది. దాంతో సమావేశంలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధంకాలేదు. అధికారపార్టీ, ఎంపిలేమిటి భూ ఆక్రమణలపై బహిరంగంగానే ఆరోపణలు, వాగ్వాదాలు చేసుకోవటం ఏమిటి అనే విషయంపై అయోమయం మొదలైంది. ఈ విషయంపై తర్వాత జగన్ కు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. దాంతో ఎంఎల్ఏలు ఇద్దరినీ జగన్ తాడేపల్లికి పిలిపించారట.

సమీక్షా సమావేశంలో ఎంపితో జరిగిన వాగ్వావాదంపై వివరాలు తెలుసుకుని తర్వాత ఫుల్లుగా క్లాసు పీకారని సమాచారం. విజయసాయిరెడ్డి అంటేనే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ జగన్ తర్వాత నెంబర్ 2 అనే విషయాన్ని బహుశా ఎంఎల్ఏలు మరచిపోయేరామో. పైగా ఎంపి ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్నారు. అలాంటి విజయసాయిరెడ్డితో బహిరంగంగా ఎంఎల్ఏలు వాగ్వాదానికి దిగితే జగన్ సహిస్తారా ? ఇదే విషయాన్ని వాళ్ళకు గుర్తుచేసి క్లాసు పీకినట్లు ప్రచారం జరుగుతోంది.