కేంద్రాన్ని కెలికిన రాష్ట్ర మంత్రి

కేంద్రాన్ని కెలికిన రాష్ట్ర మంత్రి

ఇప్పటికే ఉప్పు-నిప్పులా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు మరింత బీటలు వారేటట్లు కనిపిస్తున్నాయి. వరంగల్‌ ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ కోసం నరేంద్రమోడీ నేతృత్వంలోని  బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని టీఆర్‌ఎస్‌ దుమ్మెత్తిపోయగా....తెలంగాణకు తామెంతో చేశామని బీజేపీ లెక్కలు తీసింది. తాజాగా తెలంగాణ మంత్రి ఈటెల కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌గా తనదైన శైలిలో డిమాండ్‌ వినిపించారు.

తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేక రకాల కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ కేసులపై విచారణ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యమ సమయంలో నమోదైన కేసు విచారణ నిమిత్తం రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి రాష్ట్ర పాలకులతో పాటు కేంద్రం కూడా అనేక కేసులను తమపై అక్రమంగా మోపిందని ఆరోపించారు. వాటన్నింటినీ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

అధికారం కోల్పోయామనే అక్కసుతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని అయితే....వరంగల్‌ తీర్పుతో ప్రజలు ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పారని మంత్రి ఈటెల వ్యాఖ్యానించారు. వరంగల్‌ ప్రజలు ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోలేదని సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలిచారని చెప్పారు. కేంద్రం మెడలు వంచైనా పత్తికి గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషిచేస్తామని ఈటెల ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే రైల్వే కేసులను ఎత్తివేయాలనే ఈటెల డిమాండ్‌లో న్యాయం ఉన్నప్పటికీ...అదే విషయాన్ని ఈటెల ప్రభుత్వం కూడా గుర్తుంచుకుంటే బావుంటుందని తెలంగాణవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఇప్పటికీ వేలాదిమందిపై కేసులు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ తరహా కేసులను ఎదుర్కోవడం ఇబ్బందికరమే. స్వతహాగా ఉద్యమకారుడు అయిన ఈటెల స్పందించడమే కాకుండా....వాటిని ఎత్తివేసేలా కసరత్తు చేయాలేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు