యన్నం ఎందుకు రాజీనామా చేశాడబ్బా?

యన్నం ఎందుకు రాజీనామా చేశాడబ్బా?

వరంగల్‌ ఉప ఎన్నికలు ముగిసిన రెండు రోజులకే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పెద్ద షాక్‌ తగిలింది. మహబూబ్‌ నగర్‌ జిల్లాకు సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొద్దికాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న యెన్నం ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో మహబూబ నగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎన్నం ఆ ఎన్నికలకు ముందు బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడుపై విమర్శలు చేసి పార్టీలో వివాదాస్పదమయ్యారు.  అయితే... బీజేపీకి రాజీనామా చేసిన యెన్నం టీఆరెస్‌ లో చేరుతారని బలంగా వినిపిస్తోంది. అదేసమయంలో ఆయన కాంగ్రెస్‌ లో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదనీ అంటున్నారు.

తెలంగాణ ఏర్పాటు దశలో 2014 ఫిబ్రవరిలో అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్న యెన్నం భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత వెంకయ్య నాయుడు పైన నిప్పులు చెరిగారు. తెలంగాణ బిల్లు విషయమై వెంకయ్యపై విమర్శలు దీంతో అప్పట్లో ఆయన వ్యాఖ్యలపై అప్పటి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సంజాయిషీ ఇవ్వాలని చెప్పారు. క్షమాపణ చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని డెడ్‌ లైన్‌ పెట్టారు. దానికి స్పందించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్‌ రెడ్డి, ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌ రెడ్డిలు క్షమాపణ చెప్పిస్తామని ప్రతిపాదించారు.  అయితే... వెంకయ్య మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. తనకు క్షమాపణలు ఏమీ అవసరం లేదని చెప్పారు.

కిషన్‌ రెడ్డి, నాగం, విద్యాసాగర రావు తదితరులు రాజ్‌ నాథ్‌, వెంకయ్యలను కలిసి యెన్నం గొడవను పరిష్కరించారు. యెన్నందే తప్పని చెప్పి వారు అప్పటికి ఆ గొడవ ముగించారు.

అయితే.. క్షమాపణలు అవసరం లేదని అన్నప్పటికీ వెంకయ్య ఆ విషయాన్ని మర్చిపోలేదని అంటున్నారు. వెంకయ్య, రాజనాథ్‌ లు ఇద్దరూ యెన్నంను దూరంపెట్టారని.. దీంతో బీజేపీలో యెన్నం ఇబ్బంది పడ్డారని అంటున్నారు. ఆ కారణంగానే బీజేపీలో ఇమడలేక ఆయన బయటకొచ్చేశారని చెబుతున్నారు. లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి బయటకు వచ్చే అవసరమే ఉండదని చెబుతున్నారు.

మరోవైపు మాజీ మంత్రి నాగం జనార్ధన్‌ రెడ్డి పైన కూడా బీజేపీని వీడుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగం స్థాపించిన తెలంగాణ బచావత్‌లో యెన్నం కూడా ఉన్నారు. దీంతో నాగం కూడా బిజెపికి దూరం కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు