కోదండరాం వల్ల..బాబుకు కితాబు..కేసీఆర్‌కు చివాట్లు

కోదండరాం వల్ల..బాబుకు కితాబు..కేసీఆర్‌కు చివాట్లు

తెలంగాణ పొలిటికల్‌ జేఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నడిపించి తెలంగాణ ఉద్యమం పలించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుడిగా ఒకింత విరామం తీసుకున్నారు. తన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి రిటైరైన తర్వాత తిరిగి తెలంగాణ కోసమే పనిచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కోర్టుల మెట్టు ఎక్కిన కోదండరాం వల్ల ఆయన కలలుకన్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులకు చివాట్లు... ఏ రాష్ట్రం నుంచి అయితే విడిపోవాలని కోరుకున్నారో ఆ రాష్ట్ర పాలకునికి కితాబు దక్కింది. ఇది కూడా వ్యక్తుల నుంచి అనుకునేరు..కాదు సాక్షాత్తు  రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నుంచి.

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై కోదండరాం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రైతుల ఆత్మహత్యల నివారణపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యరిస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలిపి బి బొసలే, జస్టిస్‌ ఎస్‌వి భట్టితో కూడిన ధర్మాసనం తాజాగా విచారించింది.  కోదండరాం దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను ఇదే సందర్భంగా ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా లోగడ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు రైతుల ఆత్మహత్యల నివారణకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గూర్ఛి ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ వేణుగోపాల్‌ చదివి వినిపించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ న్యాయవాది శరత్‌ను ప్రశ్నించగా పలు చర్యలను ప్రస్తావించారు. తమకు నోటి మాటతో చెబితే సరిపోదని, లిఖిత పూర్వకంగా తెలియజెప్పాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలేవో చెప్పాలని లోగడ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం ఆసంతృప్తి వ్యక్తంచేసింది. అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం తీసుకోబోయే చర్యలతో కూడిన కౌంటర్‌ను దాఖలు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. రైతుల ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలపై వచ్చే సోమవారం లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఈ సందర్భంగా పిటిషనర్‌ తరపు న్యాయవాది రచన వాదిస్తూ , తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకు కరవు మండలాలపై ప్రకటన చేయలేదని నివేదించారు. కరవు మండలాల ప్రకటన లేకుండా కేంద్రం నిధులెలా ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ బొంస్లే జోక్యం చేసుకుంటూ రైతుల ఆత్మహత్యల వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోవద్దని అన్నారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విస్త్రతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.

మొత్తంగా కోదండరాం తన పిటిషన్‌తో చంద్రబాబుకు మెచ్చుకోలు..కేసీఆర్‌కు చివాట్లు ఏకకాలంలో అంటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు