వైకాపాలో నిప్పు: బొత్సతో రాజీపడం

వైకాపాలో నిప్పు: బొత్సతో రాజీపడం

వైకాపాలో జగన్‌ తర్వాత కింగ్‌ మేకర్‌గా ఎదుగుతున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణకు సొంత జిల్లాలో..సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బొబ్బిలి రాజ వంశానికి చెందిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయిన విజయనగరం జిల్లాకు చెందిన మరి కొందరు వైకాపా నేతలు బొత్సతో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. బొత్స కాంగ్రెస్‌ను వీడి వైకాపాలోకి వచ్చినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన ఈ ఇద్దరు అన్నదమ్ములు జగన్‌ సర్ది చెప్పడంతో కాస్త మెత్తబడ్డారు. అయితే బొత్స వైకాపాలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే బొత్స వర్సెస్‌ బొబ్బిలి రాజులు పోరు షురూ అయ్యింది.

మధ్యేమార్గంగా జగన్‌ జిల్లా రాజకీయాలను బొబ్బిలి రాజులు చూస్తారని..బొత్స రాష్ట్ర రాజకీయాలతో పాటు విశాఖ జిల్లా బాధ్యతలు చూస్తారని చెప్పినా బొత్స మాత్రం సొంత జిల్లా వైకాపా వ్యవహారాల్లో పట్టు సాధించేందుకు బొబ్బిలి రాజులను వ్యూహాత్మకంగా పక్కకు తప్పిస్తూ వస్తున్నారు. దీంతో బొబ్బిలి బ్రదర్స్‌ బొత్సపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తాజాగా బొత్స తీరును నిరిసిస్తూ వీరిద్దరు పార్టీకి వీడితే ఎలా ఉంటుందని కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.

జిల్లాలో వైకాపా బొత్స గ్రూపు, బొబ్బిలి బ్రదర్స్‌ గ్రూపులుగా విడిపోవడంతో నాయకుల మధ్య కూడా సరైన సఖ్యత లేదు. దీంతో విజయనగరం జిల్లాలో పార్టీ క్యాడర్‌ అయోమయంలో ఉంది. చివరకు బొత్స ఓ మెట్టు దిగి శుక్రవారం ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిని బొబ్బిలికి పంపించి అందరం కలిసి పనిచేద్దామని సందేశం పంపించారు. అయితే బొబ్బిలి బ్రదర్స్‌ మాత్రం బొత్స ప్రతిసారి రాజీ అంటూనే తెరవెనక మాత్రం ఆయన చేయాల్సింది చేస్తున్నారని..తాము ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పేశారట. దీంతో చేసేదేమి లేక వీరభద్రస్వామి వెనక్కి వచ్చేశారు. ఏదేమైనా బొత్స విషయంలో జగన్‌ తాము చెప్పినట్టు చేయకపోవడంతో గుర్రుగా ఉన్న బొబ్బిలి బ్రదర్స్‌ వైకాపాను వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. వీరు వైకాపాకు ఎలాంటి షాక్‌ ఇస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English