మోడీకి ఈ రేంజ్‌లో పరీక్షలా?

మోడీకి ఈ రేంజ్‌లో పరీక్షలా?

మామూలుగా ఎన్నికల ప్రచార సమయంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ వుంటుంది. పోలింగ్‌ ముగిసిన మరుక్షణంలో మొదలయ్యే ఎగ్జిట్‌ పోల్స్‌ ఆ కుతూహలానికి కొంత సమాధానమిస్తాయి. ఎన్నికల సర్వేల కన్నా ఎగ్జిట్‌ పోల్స్‌ వాస్తవ ఫలితాలకు కొంత దగ్గరగా ఉంటాయనేది సాధారణంగా ఉన్న భావన. కానీ ఇప్పుడు బీహార్‌ ఎన్నికల విషయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఉత్కంఠను మరింత పెంచేశాయి. విజయం గురించిన అంచనాలలో విపరీతమైన తేడా ఇందుకు కారణం. రెండు మినహా మిగిలిన ఛానల్స్‌ జెడియు-ఆర్జేడీ- కాంగ్రెస్‌ కూటమికి ఆధిక్యత లేదా మొగ్గు వుంటుందని చెప్పాయి. టుడేస్‌ చాణక్య, ఎక్స్‌ప్రెస్‌ సిసిరో మాత్రం బీజేపీఎన్‌డీఎ కూటమికి అధికారం వస్తుందని తేల్చినా తాజాగా వెలువడిన ఫలితాలు రివర్స్‌ అయ్యాయి.

ఎవరు అవునన్నా కాదన్నా.... ఈ ఎన్నికల ఫలితాలు మోడీకి ఎదురుదెబ్బే. ఏడాదిన్నరలోనే ప్రధాని మోడీ ప్రభావం పలచబడటం బీజేపీకి పెద్ద మైనస్‌ అనుకుంటే మూడు పార్టీలు కలిసి కూడా ప్రజల విశ్వాసం పొంది ఓట్ల చీలిక నివారించలేకపోవడం పాలక కూటమికి పరాభవమవుతుంది. అయితే రెండు సార్లు విజయం సాధించిన నితిష్‌ కుమార్‌ అప్పుడు బీజేపీతో ఉన్నారు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఆర్జేడీ కాంగ్రెస్‌లతో ఉన్నారు. గత ఎన్నికల్లో జేడీయు పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీలపైనే నడిచింది. ఏది ఏమైనా వైఫల్యం మోడీ ఖాతాలోకే చేరిపోతుంది.

దేశంలో అసహనం, అధిక ధరలు, కనీసవేతనాలు వంటి అనేక సమస్యలతో సామాన్యుడు సతమతమవుతుంటే అవేమీ పట్టించుకోకుండా కార్పొరేట్ల సేవలో మోడీ మునిగి తేలుతున్నారనే భావన ఇప్పటికే ఉంది.  ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుపు దీనికి నిదర్శనంగా భావించవచ్చు. తాజాగా వెలువడిన బీహార్‌ ఫలితాలు, కొద్దిరోజుల క్రితం వెలువడిన ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఇబ్బందికరంగా ఉండటమే కాకుండా ఒక హెచ్చరికగా విశ్లేషకులు చెప్తున్నారు. యూపీ స్థానిక ఎన్నికలు గ్రామీణ ప్రజల నాడిని తెలియజేస్తుండగా, ఢిల్లీ, మహారాష్ట్ర మున్సిపల్‌ ఫలితాలు పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజల మనోగతాన్ని స్పష్టంగా వెల్లడించాయని వివరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో బీజేపీకి ఎదురైన ఘోర పరాజయం చిన్నదేమీ కాదు. అందులోనూ ఆయన దత్తత తీసుకున్న జయపూర్‌ గ్రామ పంచాయతీలో కాషాయ పార్టీ చావుదెబ్బ తింది. మరో ఏడాదిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో వెలువడిన ఈ ఫలితాలు బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

బీహార్‌లో బీజేపీ ఓటమి ప్రభావం వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగనున్న మరో అయిదు కీలక రాష్ట్రాలపై పడుతుందని అంచనా. ఆ తరువాత జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలపైనా వుంటుంది. అందుకే ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు సహా బీహార్‌ ఎన్నికలను వేర్వేరుగా చూడలేమని వాటి ప్రభావం పెద్ద ఎత్తున్నే ఉంటుందని భావిస్తున్నారు. మోడీ గ్రాఫ్‌ను అంచనా వేసేందుకు ప్రతి ఏటా వచ్చే  ఎన్నికలు ఒక పరీక్షే అవుతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు