ఆయన చక్కాపోయి.. మాకు చిక్కులు తెచ్చాడే

ఆయన చక్కాపోయి.. మాకు చిక్కులు తెచ్చాడే

చేసుకున్నోడికి చేసుకున్న మహదేవ అన్నట్లుగా తయారైంది గ్రేటర్‌ హైదరాబాద్‌ అధికారుల పరిస్థితి. గ్రేటర్‌ కమిషనర్‌ గా వ్యవహరించిన సోమేశ్‌ కుమార్‌ వైఖరి పుణ్యమా అని గ్రేటర్‌ పరిధిలో లక్షలాది ఓట్లు గల్లంతు కావటం తెలిసిందే. ఇష్టారాజ్యంగా ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారంటూ రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం.. ఒక విచారణ బృందాన్ని హైదరాబాద్‌ కు పంపిన సంగతి తెలిసిందే.

రాజకీయ పార్టీలతోనూ అదికారులతోనూ.. ఓటర్లను నేరుగా కలిసి వారి నుంచి అభిప్రాయాలు సేకరించిన ఎన్నికల సంఘం అధికారులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్రులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో భారీగా ఓటర్లను తొలగించిన విషయాన్ని ప్రాధమికంగా గుర్తించిందని చెబుతున్నారు. గ్రేటర్‌ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను పున: పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది.

తాజాగా ఈసీ ఇచ్చిన తాజా ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు.. రంగారెడ్డి.. మెదక్‌ జిల్లాకు చెందిన అధికారులు ఓటర్ల జాబితాను క్రాస్‌ చెక్‌ చేయాల్సి ఉంటుంది. జాబితాలో పేర్లను తొలగించిన ఓటర్ల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించాలని సూచించింది. మొత్తంగా గురువారం మొదలు ఈ నెల 18 వరకు తొలగించిన ఓటర్ల వ్యవహారాల్ని క్రాస్‌ చెక్‌ చేయాలని తేల్చింది. తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణయంతో అధికారులు తల బాదుకుంటున్నారు. ఎవరి మాట వినకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్న పెద్ద మనిషి తన దారిన తాను పోయాడని.. ఇప్పుడున్న అధికారులందరికి కొత్త తిప్పలు వచ్చి పడినట్లేనని చెబుతున్నారు.

జాబితాలో తీసేసిన ఓట్ల విషయంలో.. ఓటర్లను కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తొలగించిన ఓటర్ల జాబితాలోని ఓటర్లను కలిసి ఓటర్ల వివరాల్ని పున: పరిశీలించాలని ఆదేశించారు. దీంతో.. గ్రేటర్‌ తో పాటు.. రంగారెడ్డి.. మెదక్‌ జిల్లాల అధికారులకు కొత్త తిప్పలు పడినట్లేనని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు