రోజాకు ఇవాళ షూటింగుల్లేవంట!

రోజాకు ఇవాళ షూటింగుల్లేవంట!

రోజా అనే మాజీ హీరోయిన్‌ మీకు గుర్తుంది కదా.. అదేనండీ.. మోడ్రన్‌ మహాలక్ష్మి అంటూ ప్రతిరోజూ మధ్యాహ్నం చిర్రెత్తించే చిన్నెలు పోతూ.. హొయలు ఒలికిస్తుంటుందే.. ఆమే! ఆ నిన్నటి నాయిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు కూడా అనే సంగతి మీలో ఎవరికైనా గుర్తుందా? ఉండొచ్చు లెండి. మరచిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ఈ మధ్య ఆమెకు డైలీ ఎపిసోడ్‌ షూటింగ్‌ గ్యాప్‌లో సినిమా షూటింగులు తగులుతున్నాయి గనుక.. ఎంచక్కా.. బిజీగా గడిపేస్తోంది.

అయితే అప్పుడప్పుడూ ఖాళీ దొరికినప్పుడు మాత్రం.. తాను వైకాపా నాయకురాలిని, అధికార  ప్రతినిధిని అనే విషయం ఆమె గుర్తుకు తెచ్చుకుని.. ఓసారి ఇటువైపు వచ్చి వెళుతుంటుంది. తాజాగా శుక్రవారం నాడు కూడా.. రోజాకు షూటింగు ఉన్నట్లు లేదు. అందుకే ఆమె తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్ష శిబిరం వద్దకు వచ్చారు. ఎటూ వాక్చాతుర్యం ఉన్న సీనియర్‌ రాజకీయ నాయకురాలే గనుక.. చాలా చక్కగా మాట్లాడారు కూడా. పేదవాడి కన్నీరు కత్తి కంటె పదునైనది అంటూ ఆమె హెచ్చరించడం విశేషం. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆమె మండిపడ్డారు.

ముందే ఎలా తెలిసిందో గానీ.. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ పథకానికి ప్రభుత్వం త్వరలోనే మంగళం పాడేస్తుందన్నది రోజా ఆరోపణ. ఆ విమర్శలు అన్నీ రొటీన్‌గా ఉండేవే గానీ.. రోజా షూటింగ్‌ గ్యాప్‌ కారణంగా.. దీక్ష శిబిరం వద్దకు రావడంతో.. కాసేపు జనం ఆసక్తిగా ఆమెను గమనించారు. వైకాపా దీక్షలు ఉన్నప్పుడెల్లా రోజాకు షూటింగు లేకపోతే బాగుండునని కూడా కొందరు విద్యార్థినులు అనుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు