కేసీఆర్ కే సినిమా చూపించిన సోమేశ్

కేసీఆర్ కే సినిమా చూపించిన సోమేశ్

నిన్నటి వరకూ ఆయన మాటే వేదం. ఆయనేమంటే దానికి మేధావిగా పేరున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తలూపేసేవారు. పని రాక్షసుడి అయినంత మాత్రాన.. పని చేయించుకునే సత్తా అందరిలో ఉండదన్న విషయాన్ని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ ఆలస్యంగా తెలుసుకోవటం పెద్ద తప్పే. ఎందుకంటే.. అనాలోచితంగా చెప్పే సదరు అధికారి ఆలోచనల్ని ఓకే చెప్పేసినందుకు.. కేసీఆర్ చాలాసార్లు విమర్శల పాలయ్యారు. తనను నమ్మిన అధినేతకు చెడ్డపేరు తీసుకురావాలన్న కనీస బాధ్యతను మరిచి.. ఎవరి మాట వినని సీతయ్య మాదిరి వ్యవహరించిన సోమేశ్ కు స్థానచలనం కలిగింది.

మరికొంత కాలం గ్రేటర్ కమిషనర్ గా సోమేశ్ ను కొనసాగిస్తే చిక్కులు తప్పవన్న విషయం తెలంగాణ సర్కారుకు అర్థమైందని చెబుతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన మాటలతో సినిమా చూపించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. తన తెలివితేటలతో ఆయనకే సినిమా చూపించిన వైనంపై ఆసక్తికరంగా చెప్పుకుంటారు.
సాధారణంగా సీనియర్ ఐఏఎస్ అధికారులంటే రాజకీయ అధినేతలకు ఒకింత గౌరవం ఎక్కువగా ఉంటుంది. వారి అనుభవానికి.. తెలివికి.. తమ రాజకీయ చాణుక్యం కలిస్తే అద్భుతంగా ఉంటుదని భావిస్తారు. ఒకవిధమైన గౌరవంతో దగ్గరకు తీస్తారు. కానీ.. తనకిచ్చిన అవకాశాన్ని నూటికి నూరుపాళ్లు వినియోగించుకొని.. తనపై నమ్మకం ఉంచిన పరిపాలనాధినేతకు చెడ్డపేరు రాకుండా జాగ్రత్తలు తీసుకునే అధికారులు చాలామంది ఉంటారు.

అదే సమయంలో.. తమకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునే వారూ ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా వ్యవహరించిన సోమేశ్ రెండో కోవకు చెందిన వారన్న విమర్శ ఉంది. అత్యుత్సాహంతో ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఆయన ఒక్కరే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి సైతం ఇరుకున పడ్డారనే చెప్పాలి. నిజానికి సోమేశ్ వ్యవహారశైలి కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయన విపరీతమైన కమిట్ మెంట్ తో పని చేసే వ్యక్తిగా కనిపిస్తారు. నిజానికి అలానే పని చేస్తారు. అయితే.. చిక్కల్లా దినం.. రాత్రి అన్న తేడా లేకుండా కింది స్థాయి ఉద్యోగులు మొదలు ఐఏఎస్ అధికారుల వరకూ సతాయించి చంపేస్తారు. అదే అసలు సమస్య.

తెలుగు ప్రాంతానికి ఏమాత్రం సంబంధం లేని ఆయన.. తనకు తాను తెలంగాణవాదిగా చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన స్వేచ్ఛను చనువుగా వాడేస్తూ.. ఆయనతోనే జోకులేసేస్తుంటారని చెబుతారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ మంత్రులే చెబుతుంటారు. తమ ముఖ్యమంత్రి ఇచ్చిన చనువును దుర్వినియోగం చేస్తుంటారని కూడా వాపోతుంటారు. ఇక.. ఉద్యోగల్ని మాత్రమే కాదు.. రాజకీయ నేతల్ని సైతం తన నోటితో బెదరకొట్టేయటం సోమేశ్ స్పెషల్ గా చెబుతారు. అధికారపక్ష నేతల్ని చాలాసందర్భాల్లో అస్సలు పట్టించుకోకుండా ఉంటూ.. తన ఇష్టారాజ్యంగా వ్యవహరించారని చెబుతుంటారు. ముఖ్యమంత్రి తనకు అత్యంత సన్నిహితులన్నట్లుగా తన మాటల్లో ఆయన చెప్పకనే చెప్పేస్తుండేవారు.

నిజానికి సోమేశ్ తీరును అధికారపక్షం మొదలు విపక్షం వరకూ అందరూ తిట్టేవారు.. విమర్శించే వారే. ఆయన మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలామంది ఫిర్యాదులు చేశారు కూడా. అయితే.. అతనిపై ఉన్న నమ్మకంతో కేసీఆర్ పెద్దగా పట్టించుకోరని చెప్పేవారు. ఇక.. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో చాలావరకూ తెలంగాణ రాష్ట్ర సర్కారును ఇబ్బంది పెట్టేవే. ఆస్తిపన్ను వసూళ్ల విషయంలో హడలెత్తించిన ఆయన.. ప్రభుత్వాధినేతనూ చాలాసందర్భాల్లో బోల్తా కొట్టించారని చెబుతారు.

ఏ మాత్రం శాస్త్రీయత లేకున్నా హుస్సేన్ సాగర్ ను ఖాళీ చేసి.. ఎండబెట్టి.. మళ్లీ మంచినీటితో నింపేయొచ్చని.. అలా చేస్తే హుస్సేన్ సాగర్ ను మంచినీటి చెరువగా తయారు చేయొచ్చంటూ అలివి కాని విషయాన్ని చెప్పటం.. దీనికి కేసీఆర్ వెనుకా ముందు చూసుకోకుండా తలూపేయటం.. దానిపై ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే. అంతేకాదు.. హుస్సేన్ సాగర్ లో కాకుండా.. ఇందిరాపార్కులో వినాయకసాగర్ ను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాల్ని నిమజ్జనం చేయొచ్చన్న సోమేశ్ సలహానే కేసీఆర్ సదరు ప్రకటన చేశారని చెబుతారు.
ఇక.. మల్టీ లెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణం మొదలు.. హైదరాబాద్ రోడ్ల మీద గుంత చూపిస్తే వెయ్యి రూపాయిలు ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించేలా చేసి.. సర్కారును తలెత్తుకోలేని విధంగా చేశారన్న విమర్శ ఉంది. అంతేకాదు.. టీఆర్ ఎస్ సర్కారు కొలువు తీరిన కొత్తల్లో అయ్యప్ప సొసైటీ ఇళ్ల అక్రమ నిర్మాణాలని చెప్పి సర్కారును తప్పుదోవ పట్టించి.. అక్కడి సెటిలర్లను భయభ్రాంతులకు గురి చేసిన సోమేశ్.. ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న విషయాన్ని మాత్రం సీఎంకు చెప్పకుండా.. చేతులు కాలిన తర్వాత నెమ్మదిగా చెప్పటం టీఆర్ ఎస్ సర్కారుకు చిరాకు పుట్టించేదే.

చివరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతింటికి సంబంధించిన అనుమతుల విషయంలోనూ నిర్ణయం తీసుకోకుండా నిలిపివేయటం ద్వారా వార్తల్లోకి వచ్చారు. వంద రోజుల్లో హైదరబాద్ ను మొత్తంగా మార్చేస్తామని చెప్పటం లాంటి చాలా మాటలు..ఆచరణలో సాధ్యం కాలేదని చెప్పాలి. లేనిపోని విమర్శలకు తెలంగాణ సర్కారు గురయ్యేలా చేసిన సోమేశ్ పుణ్యమా అని గులాబీబాస్ విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. గ్రేటర్ లో ఓట్ల తొలగింపు వ్యవహారం కూడా విమర్శలు వెల్లవెత్తేలా చేసి.. చివరకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి.. ఒక బృందాన్ని ప్రత్యేకంగా రాష్ట్రానికి పంపించేలా చేసి.. రాష్ట్ర పరువును దెబ్బ తినేలా చేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు. కీలకస్థానంలో ఉండి అధినేతకు సరైన సలహాలు.. సూచనలు ఇచ్చే విషయంలో దొర్లిన తప్పులు ఆయన ఒక్కడి మీదనే కాదు.. తెలంగాణ సర్కారు మీద ప్రభావం చూపాయని చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు