‘అమెరికావోడికి’ ఎంత అహంకారమంటే..

‘అమెరికావోడికి’ ఎంత అహంకారమంటే..

57 ఏళ్ల పెద్దాయన అటూఇటూ పరిసరాల్ని చూసుకుంటూ నడుస్తుంటే అతనో సంఘవిద్రోహి అన్న సందేహం కలుగుతుందా? ఒకవేళ కలిగిందే అనుకుందాం.. అతడ్ని పోలీసులు ఆపి మాట్లాడుతుంటే.. నడుము వంగిపోయిన ఆ పెద్ద మనిషి అల్పంగా అర్థం కాన్నట్లు చూస్తుంటే తుపాకి జేబులో పెట్టుకొని ఎవరినైనా వేసేద్దామని తిరుగుతున్నట్లుగా ఫీలయ్యే పోలీసు ఉంటాడా?

తన భాషలో బడాబడా మాట్లాడేస్తుంటే.. ‘‘నో ఇంగ్లిష్’’ అంటూ బిక్కముఖంతో ఐదుసార్లు చెప్పి.. ‘ఇండియా’ అంటూ ఆందోళనతో మాట్లాడితే.. ఫెడీల్ మని కాలు మీద కొట్టేసి.. కిందపడేసి అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందా?తమకొచ్చిన సందేహాలు తీర్చుకునేందుకు ఆపిన ముసలాయన్ను.. వెన్నుముక విరిగేలా.. కాలు ఫ్యాక్చర్ అయ్యేలా కొట్టి.. ఆసుపత్రి పాల్జేసిన పోలీసాఫీసరు ఎక్కడైనా ఉంటారా? అని అడిగితే.. అమెరికాలో అని చప్పున చెప్పేయొచ్చు. అమెరికా మీద అభిమానంతో అంత మాట అంటారా అని అనే వాళ్లు ఎవరైనా ఈ ఉదంతం మొత్తం చదివితే.. మనసు మారటం ఖాయం.

కొద్ది నెలల క్రితం గుజరాత్ కు చెందిన సురేశ్ భాయ్ పటేల్ అనే పెద్దాయన కొడుకు.. కోడలు.. మనమడ్ని చూసుకునేందుకు అమెరికాలోని అలబామాకు రావటం.. కాసేపు బయటకు వెళ్లి వద్దామన్న ఉద్దేశంతో వచ్చిన ఆయన్ను పార్కర్ అనే పోలీసు అధికారి దారుణాతిదారుణంగా కొట్టేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. పోలీసు అధికారి కొట్టిన దెబ్బలకు కాలు ఫ్యాక్చర్ కావటంతో పాటు.. మెడ భాగంలో గాయమైన పరిస్థితి. ఈ కేసు తాజాగా విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ అమెరికా పోలీసు అధికారి తన తరఫు లాయరుతో ఎంత పిడివాదనను వినిపిస్తారో చూస్తే.. రక్తం ఉడికిపోవటమే కాదు.. అమెరికావోడికి ఎంత అహంకారం అనిపించక మానదు.

వీధుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న పటేల్ ను తాను అపానని.. జేబులో నుంచి చేతులు తీయమంటే అతను తీయలేదన్నది పోలీసు అధికారి వాదన. జేబులో చేతులు పెట్టుకోవటం నేరమా అన్న ప్రశ్న వస్తుందన్న ఉద్దేశంతో దానికి వారు చెబుతున్నదేమంటే.. జేబులో చేతులు పెట్టుకొని.. ఎంతకీ తీయకుంటే తుపాకీ పెట్టుకొని ఉండొచ్చు కదా? మారణాయుధం చేత బట్టుకొని దాడి చేసే ప్రమాదం ఉంది కదా? అంటూ తనకున్న సందేహాల్ని వ్యక్తం చేశాడు.అంతేకాదు.. అమెరికాలో ఉండేవాడికి.. స్థానిక భాష రాకుండా ఎలా ఉంటారన్న మరో విచిత్రమైన వాదనను వినిపించాడు. పటేల్ అమెరికా వాసి కాదని.. అమెరికాలో ఉంటున్న కొడుకు దగ్గరకు చుట్టం చూపుగా వచ్చినోడన్న విషయాన్ని కావాలనే మర్చిపోయినట్లుగా వాదించాడు.

ఇన్ని మాటలు చెప్పిన పోలీసు అధికారి తరఫు లాయరు.. జరిగింది దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణిస్తూ.. అనుకోకుండా జరిగిందే తప్పించి కావాలని చేసింది కాదంటూ.. తన అనాగరిక చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.

పోలీసు అధికారి లాయరు చేసిన వాదనలోని అంశాల్ని చూస్తే.. అతగాడి వాదన ఎంత పేలవంగా ఉంటుందో ఇట్టే తెలిసిపోతుంది. ఒక ముసలి వ్యక్తి ఆయుధం జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడన్నది ప్రధాన ఆరోపణ అయితే.. తనపట్ల దాడి చేస్తున్న వాడిపై బేలగా చూస్తుండిపోయిన విషయం మొదటి దెబ్బ తర్వాత అయినా అర్థం కాలేదా?

అమెరికాలో ఉండేవాడికి అమెరికావోడి భాష రావాలని చెబుతున్న లాయరుకి.. భారతదేశానికి వచ్చే ప్రతి అమెరికన్.. తాను పర్యటించే ప్రాంతాలకు చెందిన స్థానిక భాషను తప్పనిసరిగా మాట్లాడతాడా? అలా మాట్లాడే వారికి మాత్రమే నివసించే అవకాశం ఉందని వాదించటం ఎంత దారుణం?.. దుర్మార్గం? ఇంగ్లిషు అరకొర వచ్చినా.. అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడే ఒక అధికారి మాటను అర్థం చేసుకోవటం అంత తేలికైన పని కాదన్న విషయం మర్చిపోకూడదు.ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే.. ఆవేశంతో విరుచుకుపడిన ఒక యువ అధికారిని చూసి ఒక ముసలితనంలో ఉన్న వ్యక్తి ఎలా స్పందించగలడు? తనకొచ్చిన మాటల్ని అతి కష్టం మీద.. ‘‘నో ఇంగ్లిష్’’ అంటూ ఐదుసార్లు చెప్పి.. ‘‘ఇండియన్’’ అని చెప్పిన తర్వాత కూడా పోలీసు అధికారి ఆ ముసలోడిని ఎందుకు చావబాదినట్లు? తన ఓవర్ యాక్షన్ తో ఒక అమాయకుడికి పెద్ద ఎత్తున దెబ్బలు తగిలాయన్న విషయాన్ని మర్చిపోవటమే కాదు.. ఇంత రచ్చకు కారణం తానేనన్న కనీస పాప చింతన సదరు పోలీసు అధికారికి లేదన్న విషయం అతగాడి లాయర్ తీసే లా పాయింట్లు చూస్తేనే అర్థమవుతాయి.

తప్పు చేసి.. దాన్ని సమర్థించుకునే తెల్లోడి తెలివితేటలు చూసినప్పుడు.. అమెరికావోడి అహంకారం ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. ఇక.. పటేల్ తరఫున లాయర్ తన వాదనను వినిపిస్తూ..పోలీసు అధికారి వ్యవహరించిన దూకుడుతనాన్ని పున: సమీక్షించాలని కోరాడు. ఒక అమాయక ముసలి వ్యక్తికి జరిగిన అన్యాయానికి అమెరికా లోని సదరు కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు