ఉండవల్లి వ్యాఖ్యల ఉద్దేశ్యమేమిటి?

ఉండవల్లి వ్యాఖ్యల ఉద్దేశ్యమేమిటి?

సమైక్యవాదులకు షాక్ తగిలేలా ఎంపీ ఉండవల్లి వ్యాఖ్యలు చేశారు. మాటలతో తిమ్మిని.. బొమ్మిని చేయటంతో పాటు.. లెక్కలు డొక్కలు చెప్పటం.. వైనంగా మాట్లాడే సీమాంధ్ర నేతల్లో ఒకరైన ఈ రాజమండ్రి ఎంపీ.. విభజనపై వెనక మాటలు మాట్లాడుతున్నారు. సమైక్యానికి గట్టిగా నిలబడతామని.. కాదూ.. కూడదంటే మాత్రం విభజనకు అంగీకరిస్తామంటూ కొత్త రాగం తీయటంతో సమైక్యవాదుల గుండెల్లో రాయి పడేలా చేసింది. అందుకే గతం కంటే భిన్నంగా ఆయన విభజనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. విద్వేషాలతో కలిసి ఉండటం కంటే.. విభజనే మంచిదని తేల్చి చెప్పారు.

ద్వేషం అన్నది ఒక్కసారి పుట్టాక అది.. కలిసి ఉన్నప్పుడు కన్నా.. విడిపోయిన తర్వాత మరింత పెరుగుతుందన్న విషయం ఉండవల్లి లాంటి వాళ్లకు తెలీదా? లేక.. సోనియమ్మ భజనతో మర్చిపోయారా? చరిత్రను చూస్తే.. దేశం నుంచి విడిపోవాలని కలలు కని మరీ విడిపోయిన పాకిస్థాన్ తర్వాత.. తర్వాత శత్రుదేశమే అయ్యిందే తప్ప.. మిత్రదేశంగా మారలేదుగా. తెలంగాణ ఏమీ ఇప్పుడు దేశం నుంచి విడిపోవటం లేదుగా.. అనవసరమైన పోలక అనిపిస్తుంది కానీ.. వాస్తవ దృష్టితో ఆలోచించండి.

విద్వేషంతోనే విభజనకు తలుపులు తీసిన తెలంగాణ నాయకులు వేరే రాష్ట్రం ఏర్పడ్డాక కూడా దాన్ని వదులుతారా? ఎందుకంటే.. తెలంగాణ వస్తే.. అంటూ త్రీడీ ఎఫెక్ట్స్ లో చూపిస్తున్న టీఆర్ఎస్ నాయకులు కావచ్చు.. తెలంగాణ జపం చేస్తున్న తెలంగాణ వాదులు కావచ్చు.. ఒకసారి వచ్చాక.. అధికారం తమ చేతికి చిక్కాక.. వారి పనులు వారికుంటాయి. ఇన్నాళ్లు ఉద్యమంలో సమయాన్ని గడిపిన వారికి.. ఇళ్లు చక్కదిద్దుకోవటంలో ఎవరికి వారు బిజీగా ఉండటం తప్పదు. ఆ సమయంలో.. చెప్పినవన్నీ సాకారం కావు కాబట్టి.. తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరగటం ఖాయం. దాన్ని చల్లార్చేందుకు.. సీమాంధ్రులు చేసిన నష్టాన్ని పూడ్చటం నాలుగేళ్లలో కాదు నలభై ఏళ్లలో కూడా తీరేది కాదన్న వ్యాఖ్యలతో మరింత విద్వేషం పెంచి పబ్బం గడుపుకోరన్న గ్యారెంటీ ఏమీ లేదు? అదే జరిగితే.. సీమాంధ్రులకు చెందిన ఆస్తులకు రక్షణ గాల్లో దీపంలా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సందర్భాల్లో ద్వేషం అంతకంతకు పెరగటమే తప్ప తగ్గేది ఉండదు.

కాబట్టి.. విభజనతో విద్వేషం చల్లారుతుందన్న ఉండవల్లి మాటల్లో నిజాయితీ కంటే కూడా.. సమైక్యవాదులను విభజన వైపు మానసికంగా సిద్ధం చేయటమే కనిపిస్తుందని చెప్పాలి. ఉండవల్లి ఎందుకీ డొంకతిరుగుడు... విషయం స్టైట్ గా చెప్పేయొచ్చుగా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English