కేసీఆర్‌...మ‌ళ్లీ ఎత్తువేశారు

కేసీఆర్‌...మ‌ళ్లీ ఎత్తువేశారు

రాజ‌కీయ వ్యూహాల్లో అందెవేసిన చెయ్యి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మ‌రోమారు ఈ త‌ర‌హా ఎత్తుగ‌డ‌ను వేశారు. తాజాగా కేసీఆర్ రాష్ర్ట గవర్నర్ నరసింహన్ తో రాజ్‌భ‌వ‌న్లో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభానికి రావాలని గవర్నర్ ను ఆహ్వానించారు. దాంతోపాటు ట్యాంక్ బండ్ మీద జరిగే బతుకమ్మ ముగింపు వేడుకలకు హాజరుకావాలని కూడా ఆయనను కోరినట్లు సమాచారం.

సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాన్ని నిర్మించారు. ఇప్పటికే స్వయంగా కేసీఆర్ పలుమార్లు ఈ కాలనీని సందర్శించారు. గ‌తంలో ఈ గృహాల‌ను గ‌వ‌ర్న‌ర్ కూడా సంద‌ర్శించారు. వాటిని ప‌రిశీలించిన అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేశారు. తాజాగా గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయిన కేసీఆర్ ఈ ఇళ్ల గృహప్రవేశాలకు రావాలని ఆహ్వానించ‌డం వెన‌క రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఐడీహెచ్ కాలనీలోని డ‌బుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం కోసం కేసీఆర్ ఎంపిక చేసుకున్న ద‌స‌రా రోజే న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తి శంకుస్ధాపన కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ అమ‌రావ‌తి శంఖుస్థాప‌న‌కు వెళ‌తారా లేదా పేద‌ల ఇళ్ల ప్రారంభోత్స‌వానికి వ‌స్తారా అనేది అంచ‌నా వేసుకునేందుకు కేసీఆర్ ఈ ఆహ్వాన ప్ర‌క్రియ‌ను ఎంపిక చేసుకున్న‌ట్లు భావిస్తున్నారు. అయితే ఏపీ రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దాదాపు అన్ని రాష్ర్టాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు, గ‌వ‌ర్న‌ర్లు వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ అమ‌రావ‌తికే ప్రాధాన్యం ఇస్తార‌ని పేర్కొంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు