జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరి దృష్టి చంద్రబాబు పైనే

తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి)ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తారా ? ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ జోరందుకుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలు రెడీ చేసుకోవచ్చని ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో అన్నీ పార్టీలు ఒక్కసారిగా క్రియాశీలమైపోయాయి.

ఇదే విషయమై పార్టీ నేతలతో చంద్రబాబు శనివారం జూమ్ యాప్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తాజా ప్రకటన ప్రకారం 2016లో జరిగినట్లే 150 డవిజన్లకే ఎన్నికలు జరుగుతాయి. అలాగే అప్పట్లో జరిగిన రిజర్వేషన్లనే ఇపుడు కూడా అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించంటంతో రిజర్వుడు డివిజన్ల విషయంలో కూడా అందరిలోను స్పష్టట ఉంటుంది. ఇదే విషయాన్ని చంద్రబాబు నేతలతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఆసక్తి ఉన్న నేతలతో జాబితా తయారు చేయాలని చెప్పారు. వీలైనంతలో ప్రతి డివిజన్లో యువనేతలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్రను ఓటర్లకు గుర్తుచేయాలని చంద్రబాబు స్పష్టంచేశారు.

పోయినసారి ఎన్నికల్లో ప్రచారం విషయంలో చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్ని డివిజన్లలో పార్టీ ప్రదాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ మాత్రమే ప్రచారం చేశారు. అప్పటి ఎన్నికల్లో పోటి చేసిన డివిజన్లలో టీడీపీ ఎక్కడా గెలవలేదు. దాంతో తెలంగాణా టీడీపీ బాగా నీరసపడిపోయింది. అదే సమయంలో చంద్రబాబు కూడా తెలంగాణాలో టీడీపీని దాదాపుగా అధ్యక్షుడు ఎల్. రమణకే వదిలిపెట్టేశారు.

అలాంటిది ఇపుడు చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. రెగ్యులర్ గా తెలంగాణా నేతలతో టచ్ లోనే ఉంటున్నారు. ఇటువంటి సమయంలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మరి చంద్రబాబు ఎటువంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. పోయిన ఎన్నికల్లో అంటే చంద్రబాబు ఏపి సీఎంగా ఉన్నారు కాబట్టి జీహచ్ఎంసి ఎన్నికలపై దృష్టి పెట్టలేదు. కానీ ఇపుడు రెండు రాష్ట్రాల్లోను ప్రతిపక్షమే. పైగా గడచిన ఏడు మాసాలుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కాబట్టి చంద్రబాబు ఏమి చేయబోతున్నారనేది సస్పెన్సుగా మారింది.